ఆలయంలో ఆధిపత్య పోరు

19 Feb, 2015 02:24 IST|Sakshi

తిరుమలలో అన్ని విభాగాల్లోనూ నిర్లక్ష్యం
గాడితప్పిన ఆలయ నిర్వహణ
మూలాలు పట్టించుకోని  అధికారులు
పట్టించుకోకపోతే చర్యలు  తప్పవంటున్న టీటీడీ ఈవో

 
తిరుమల: భక్తుల కోర్కెలు తీర్చే కోనేటిరాయుని సన్నిధిలో ఆధిపత్య పోరు సాగుతోంది. దీని వల్ల ఆలయ నిర్వహణ గాడితప్పింది. దాదాపుగా అన్ని విభాగాల్లోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఎవరి పనులు వారు చేయకుండా ఆధిపత్యకోసం ఆరాటపడుతున్నారు. దీని ప్రభావం ఆలయ నిర్వహణపై స్పష్టంగా కనిపిస్తోంది.  బుధవారం తెల్లవారుజామున బంగారు వాకిలి తాళం మొరాయించడంతో ఈవో నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా అయోమయంలో పడాల్సి వచ్చింది. తిరుమల ఆలయంలో కేవలం ఆలయ విభా గం కాకుండా విజిలెన్స్, ఇంజనీరింగ్, వాటికి అనుబంధ విభాగాలు ఉన్నాయి. అంతర్గతంగా ఆయా విభాగాల్లోనూ, ఇతర విభాగాల మధ్య పెత్తనం సాగుతోంది. చాలామంది అసలు విధులను పక్కన బెట్టి కొసరు పనులపై అధిక దృష్టిసారిస్తున్నారన్న విమర్శలున్నాయి. రోజురోజుకీ ఇలాంటి పరిస్థితి పెరుగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో పైపైన అన్ని విభాగాలు కలసి పనిచేస్తున్నట్టు కనిపించినా అంతర్గతంగా పోరు ఉంది. విభాగాల మధ్యనే కాదు ఒకే విభాగంలో ఉండే పైఅధికారంటే కింది అధికారికి పొసగటం లేదు.  ఎవర్ని కదిలించి నా ఒకరిపై ఒకరు ఫిర్యాదుల వర్షం కురిపిస్తుండడం ఇటీవల పెరిగిపోయింది. సమ యం దొరికితే చాలు ఆయా విభాగాల అధికారులు ఈవో, జేఈవో స్థాయిలోని అధికారులకు వారివారి సమస్యలు, ఆధిపత్య పోరు విషయాలను చెబుతుంటారు.  
 
మూలాలు పట్టించుకోని విభాగాధిపతులు

రోజుకు లక్షమంది  భక్తులు వచ్చే ఆలయ నిర్వహణలో సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిపై ఆయా విభాగాధిపతులు పట్టించుకుంటే ఆ సమస్యలు అప్పటికప్పుడే తీరిపోతాయి. అయితే, ఇక్కడి అధికారులు మాత్రం సమస్యల్ని పక్కన పెట్టి ఇతర పెత్తనాల్లో బిజీగా ఉండడం వల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. బుధవారం వేకువజాము కీలకమైన బంగారు వాకిలి (ద్వారం) తాళం మొరాయిం చింది. ఇది యాంత్రికలోపం అయినప్పటికీ.. ఆ సమయంలో శ్రీలంక అధ్యక్షుడితో పాటు ఈవో కూడా ఆలయంలోనే ఉన్నారు.   కీలకమైన సమయంలో మొరాయించడం వల్ల ఈవో, జేఈవో నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ హైరానా పడాల్సి వచ్చింది.
 

పట్టించుకోకపోతే చర్యలు తప్పవు : ఈవో

బుధవారం  ఘటన నేపథ్యలో ఆలయ అధికారులపై టీటీడీ ఈవో సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయ నిర్వహణ విషయంలో తానే జోక్యం చేసుకుంటానని చెప్పారు.
 
 

>
మరిన్ని వార్తలు