జనవరికి ఓటర్ల తుది జాబితా

8 Dec, 2013 04:57 IST|Sakshi

చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నాటికి జిల్లాల్లో ఓటర్ల తుది ఫొటో జాబితా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఫొటో ఓటర్ల జాబితా రూపకల్పనపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం ఇంటింటి సర్వేను వెంటనే పూర్తి చేయాలని ఆదేశిం చారు.

అనర్హుల పేర్లను తొలగించాలని సూచించారు. బూత్ లెవల్ అధికారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, పరిష్కార వివరాలను ఈ నెల 15వ తేదీకి సేకరించి వెంటనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో యువత నమోదు శాతం పెంచేందుకు విద్యా సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఆదివారాలతో సహా ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు నిర్దేశిత కేంద్రాల్లో ఉండాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
కుప్పంలో 43 వేల డూప్లికేట్ పేర్లు


జిల్లాలో కొత్తగా 1.2 లక్షల మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ రాంగోపాల్ భన్వర్‌లాల్‌కు వివరించారు. వీరిలో సాధారణ ప్రజలు 57 వేల మంది,  18-19 ఏళ్ల వయసు గల వారు 63 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. యువత నమోదు శాతం పెరిగేందుకు జిల్లాలోని కళాశాలలను గుర్తించామని చెప్పారు. తప్పులు లేని ఫొటో ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 43 వేల డూప్లికేట్ పేర్లు ఉన్నాయన్నారు. డూప్లికేట్ పేర్ల తొలగింపునకు అన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో శేషయ్య, పడా ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌డీవో పెంచలకిషోర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు