అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

31 Mar, 2018 12:49 IST|Sakshi

పుట్టెడు దుఃఖంలోనూ భర్త అవయవ దానానికి అంగీకరించిన భార్య

గుండె, కిడ్నీలు, కళ్లు సేకరణ

నెల్లూరు(బారకాసు)/వాకాడు: బ్రెయిన్‌ డెడ్‌కు గురైన తన భర్త అవయవాలతో మరికొందరికి ప్రాణం పోయాలని సంకల్పించిన భార్య అవయవదానానికి అంగీకరించడంతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. వివరాలు..వాకాడు మండలం కొండాపురం పంచాయతీ జాండ్రపేటకు చెందిన రాయపు శ్రీనివాసులు(45) ట్రాక్టర్‌ డ్రైవర్‌.  భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు మహేంద్ర, మధుసూదన్‌ ఉన్నారు.  వావిళ్లపాళెం వద్ద మంగళవారం రాత్రి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులు తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన శ్రీనివాసులును కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులపాటు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని  కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపారు. శ్రీనివాసులుకు బ్రెయిన్‌ డెడ్‌ మాత్రమే అయిందని, మిగిలిన అవయవాలు పనిచేస్తున్నాయని, వెంటిలేటర్‌ను తొలగిస్తే చనిపోతాడని తెలిపి అవయవదానం విశిష్టతను వివరించారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆస్పత్రి వైద్యులు జీవన్‌ధాన్‌ సంస్థకు సమాచారం అందించారు.

అవయవ శస్త్రచికిత్స విజయవంతం  
గురువారం రాత్రి వైద్య బృందం శ్రీనివాసులు దేహం నుంచి గుండె, కిడ్నీలు, కళ్లు వేరు చేసే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.  గుండెను చెన్నైలోని గ్లోబల్‌ హాస్పిటల్‌ వైద్యులు తీసుకెళ్లగా.. ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్‌ వైద్యులు తీసుకెళ్లారు. మరో కిడ్నీని సింహపురి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చేందుకు ఆస్పత్రిలోనే భద్రపరిచారు. నేత్రాలను నెల్లూరు నగరంలోని మోడరన్‌ కంటి వైద్యశాల వారు సేకరించారు. అవయవదానం అనంతరం శ్రీనివాసులు మృతదేహాన్ని కోట మండలం విద్యానగర్‌ నుంచి వాహనంపై ర్యాలీగా స్వగ్రామం తీసుకెళ్లారు. శ్రీనివాసులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసులు పెద్ద కుమారుడు మహేంద్రబాబు ఎంటెక్, చిన్న కుమారుడు మధుసూదన్‌ డిగ్రీ చదువుతున్నారు. 

అవయవదానంపై అవగాహన పెరిగింది    
సింహపురి ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి చైర్మన్‌ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరిస్తున్నారని తెలిపారు. అవయవదానం చేయడమంటే ఇతరులకు పునర్జన్మను ప్రసాదించినట్లని అన్నారు. అవయవదాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సమావేశంలో హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్‌  సాగర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు