మహిళా వ్యతిరేక నేరాల్లో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు..

24 Apr, 2018 15:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అధికార పార్టీకి చెందిన  ఐదుగురు నేతలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను ఈ నెల 19న  విడుదల చేసింది. ఏడీఆర్‌ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్‌ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్‌రావు, మరో సీనియర్‌ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు.

ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఆయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. అత్యంత వివాదాస్పదుడిగా పేరు ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై  మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 23 కేసులున్నాయి. 

ఇందులో తీవ్రమైన సెక్షన్ల కింద ఉన్న కేసులు 13 ఉన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణపై 10 కేసులు,  పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై 4 కేసులున్నట్టు ఏడీఆర్‌ సంస్థ నిర్థారించింది. మహిళలకు సంబంధించిన కేసుల్లో  మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు  పేర్లు కూడా ఉన్నాయి.  మంత్రి దేవినేని ఉమాపై 13 కేసులు,  అచ్చెన్నాయుడిపై రెండు కేసులున్నట్టు ఆ సంస్థ తన నివేదిక తేల్చింది.

కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు