ఫ్లాట్ రూ.9-14 లక్షలు!

2 Sep, 2013 02:19 IST|Sakshi
ఫ్లాట్ రూ.9-14 లక్షలు!

చిరుద్యోగులకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చే ప్రత్యేక ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ఈ ఇళ్ల తాత్కాలిక ధరలను రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ప్రకటించింది. రాష్ట్రంలో తొలి విడతగా పది ప్రాంతాల్లో మూడు వేల ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమైన గృహనిర్మాణ మండలి తాత్కాలిక ధరలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, చందానగర్, నిజాంపేట, బండ్లగూడ, రెడ్‌హిల్స్, విశాఖపట్నంలోని మధురవాడ, విజయవాడలోని భవానీపురం, నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి, నల్లగొండ పట్టణంతోపాటు గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లోనూ తొలివిడతలో ఇళ్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
 
 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లను నిర్మించనున్నారు. స్థానికంగా ఉన్న భూముల విలువల ఆధారంగా వాటి ధరలను నిర్ధారించారు. వీటిల్లో అత్యధికంగా కూకట్‌పల్లి ప్రాజెక్టు ధరను ఖరారు చేశారు. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ ధరను రూ.14 లక్షలుగా నిర్ణయించగా.. దానికి సమీపంలోనే ఉండే చందానగర్‌లో ఆ ధర రూ.11 లక్షలుంది. నగరంలోని ఐదు ప్రాజెక్టులకు గాను బండ్లగూడ ప్రాజెక్టు ధర అత్యల్పంగా రూ.9.3 లక్షలుగా ఖరారు చేశారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను గృహనిర్మాణ మండలి వెబ్‌సైట్  నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పూరించి, ఎంచుకున్న ప్రాజెక్టు తాత్కాలిక ధరలో 10 శాతం మొత్తాన్ని డీడీ రూపంలో ధరావతు(ఈఎండీ)గా చెల్లించాల్సి ఉంటుంది.
 
 దరఖాస్తులు సమర్పించడానికి తుది గడువు సెప్టెంబర్ 25. రక్షణ రంగంలో పనిచేస్తున్నవారికి అక్టోబర్ 10 వరకు గడువుందని అధికారులు చెప్పారు. దరఖాస్తు ధర రూ.500. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని నాలుగో తరగతి స్థాయి నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉద్యోగులు.. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు, దుకాణ, వ్యాపార సముదాయాల్లో పనిచేసే చిరుద్యోగులను  ఉద్దేశించి ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.15 వేలు, అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారే దీనికి అర్హులని అధికారులు ప్రకటించారు. నాలుగో తరగతి ఉద్యోగులకు తొలి ప్రాధాన్యముంటుంది. ఈ ఫ్లాట్లకు రుణ వసతి కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు