కేక్‌ తిన్నారు.. ఆసుపత్రి పాలయ్యారు

25 Aug, 2018 13:52 IST|Sakshi
వెంకట సుబ్బయ్యను పరీక్షిస్తున్న డాక్టర్‌ శైలజ

రైల్వేకోడూరు రూరల్‌ : జన్మదినం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కేక్‌ తెచ్చుకుని తిన్న 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడలో చోటు చేసుకుంది. బాధితులు, వారి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీవీ కండ్రికలో రెండు రోజుల క్రితం ఓ యువకుడికి వివాహమైంది. జమ్మలమడుగుకు చెందిన బంధువులు దండు సుగుణమ్మ, ఆమె భర్త దండు రవి, కుమార్తె మల్లీశ్వరిలు వివాహానికి హాజరయ్యారు. కాగా, గురువారం సుగుణమ్మ పుట్టిన రోజు కావడంతో బంధువుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని భావించారు. ఈ క్రమంలో రైల్వేకోడూరు పట్టణంలోని చిట్వేలి రోడ్డులో బాలికోన్నత పాఠశాల పక్కనున్న స్వీట్‌ స్టాల్‌ నుంచి గురువారం సాయంత్రం 1.5 కేజీలు ఉన్న కేక్‌ను తీసుకెళ్లారు.

రాత్రి కట్‌ చేసి ఇంటిలోని బంధువులు తిన్నారు. అర్థ రాత్రి దాటిన తర్వాత ఓ బాలికకు వాంతులు ప్రారంభం అయ్యాయి.  వెంటనే పట్టణంలోని ఓ వైద్య శాలలో వైద్యం చేయించారు. తెల్లవారు జామున   సుగుణమ్మ, ఆమెభర్త రవి, కుమార్తె మల్లీశ్వరి, బాబు, గుత్తి నుంచి వచ్చిన లక్ష్మీదేవి, బాలుడు సాయికుమార్, జ్యోతి, వెంకటసుబ్బయ్యలతో కలిపి మొత్తం 12 మందికి వాంతులు, విరేచనాలు అయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు వెంటనే రైల్వేకోడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ వెంకట సుబ్బయ్య వైద్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషాహారం తినడం వల్లే ఇలా  జరిగిందని తెలిపారు. మిగిలి ఉన్న కేక్‌ తినవద్దని తెలిపారు.  విషయంపై బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విషాహారం తిన్న వీవీ కండ్రిక గ్రామంలో డాక్టర్‌ శైలజ, ఎంపీహెచ్‌ఈఓ మార్టిన్, దాస్, ఏఎన్‌ కలుదా. సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి వైద్య సేవలు అందించారు.

మరిన్ని వార్తలు