అన్నదాతకు గుండెకోత

31 Jan, 2014 03:27 IST|Sakshi

వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రకటనలకే పరిమితమవుతోంది. ఓవైపు తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు మరోవైపు అన్నదాత జీవితంతో ఆటలాడుకుంటున్నారు. రోజుకు కనీసం మూడు గంటల పాటు కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయకపోతుండటంతో నీరు చాలక పొలాలు ఎండుముఖం పట్టాయి. చేతికందే దశలో ఉన్న పంట కళ్ల ముందే నిలువునా ఎండిపోవడం చూసి రైతు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
 
 నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, అరటి, నిమ్మ, బత్తాయి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. రబీ సీజన్ కావడంతో రైతులు ఎక్కువ విస్తీరణంలో వరి  సాగు చేశారు. ఈ పంటల సాగుకు ఎక్కువ మంది రైతులు విద్యుత్ మోటార్లపై ఆధారపడుతున్నారు. విద్యుత్ అధికారులు వ్యవసాయ సర్వీసులను మూడు గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. పగలు, రాత్రి కలిపి మూడు విడతల్లో ఏడు గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. ఎక్కువ ప్రాం తాల్లో మూడు గంటలకు మించి విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విడతలో గంటకు మించి విద్యుత్ ఇవ్వకపోతుండటంతో పంటలకు సరిపడా నీటిని అందించలేకపోతున్నారు. విడతల వారీ సరఫరాతో వస్తున్న నీళ్లు కాలువలు తడిచేందుకే సరిపోతున్నాయి.
 
 పంటలు ఎండుముఖం
 వరి, చెరకు, నిమ్మ, అరటి, కూరగాయలు సాగుచేస్తున్న పొలాలకు తరచూ నీరు అందించాలి. అయితే అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో గూడూరు డివిజన్‌లో వరి, చెరకు, నిమ్మ పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న పంటకు తగినంత నీరు అందించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు. ఉదయగిరి, కావలి డివిజన్లల్లోని రైతుల పరిస్ధితి మరీ ఆధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది రైతులు మోటార్లపై ఆధారపడి వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇప్పు డే పరిస్థితి ఇలా ఉంటే ఎండలు ముదిరితే నిమ్మ, బత్తాయి, చెరకు, కూరగాయల తోటలకు నీరు ఎలా అందించాలని వారు ఆందోళన చెందుతున్నారు.
 పెరిగిన వినియోగం
 జిల్లాలో వివిధ కేటగిరిల్లో మొత్తం 11,15,166 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 85 లక్షల యూనిట్ల విద్యుత్‌ను కోటాగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 90 లక్షల యూనిట్లకు పైగా వినియోగం జరుగుతోంది. అం దులో 30 శాతం వ్యవసాయానికే ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 30 శాతం పరిశ్రమలకు, 40శాతం గృహావసరాలతో పాటు ఇతర రం గాలకు వినియోగిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు.   
 
 రోడ్డెక్కుతున్న రైతన్న
 వ్యవసాయ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో గుండె రగిలిన రైతన్న రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నాడు. రెండు రోజుల క్రితం బిరుదవోలు, బ్రాహ్మణపల్లి, కళ్యాణపురం, ముత్యాలపాళెం, చెర్లోపల్లి, పార్లపల్లి రైతులు పొదలకూరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అంతకుముందు దగదర్తి మండలానికి చెందిన రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నిత్యం ఏదోక ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగుతున్నా అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
 7 గంటల సరఫరాకు ప్రయత్నిస్తున్నాం :
 వ్యవసాయానికి 7 గంటల పాటు సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రెండు రోజులుగా జిల్లాలో వినియోగం పెరిగింది. 92 లక్షల యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగింది. వ్యవసాయానికి సరఫరా ఇచ్చేందుకు గృహ అవసరాలకు కోతలు విధిస్తున్నాం.
 - వెంకటేశ్వరరావు, టెక్నికల్ డీఈ, ట్రాన్స్‌కో
 

మరిన్ని వార్తలు