అటవీ డివిజన్‌గా చింతపల్లి?

22 Sep, 2014 00:49 IST|Sakshi
అటవీ డివిజన్‌గా చింతపల్లి?
  • ఐదు రేంజ్‌లతో ఏర్పాటుకు ప్రతిపాదన
  •  పెద్దదైన నర్సీపట్నాన్ని విభజించే యోచన
  •  సిబ్బంది పదోన్నతుల్లో చిక్కులు?
  • జిల్లాలో నాలుగో అటవీ డివిజన్‌గా చింతపల్లిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు కదులుతున్నాయి. జిల్లాలోనే నర్సీపట్నం అతిపెద్ద అటవీ డివిజన్. ఎనిమిది రేంజ్‌లు, 116 బీట్లు, 47 సెక్షన్లతో రెండు లక్షల 34 వేల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంది. నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కూడా రేంజ్‌లున్నాయి. ఇంత పెద్ద డివిజన్‌ను పర్యవేక్షణ చేయడం ఒక డీఎఫ్‌వోతో సాధ్యం కాదు. దీంతో పరిపాలన సౌలభ్యం కోసం చింతపల్లి కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తయారైంది. ఉద్యోగుల పునర్నిర్వహణ కమిటీ చేస్తున్న ప్రతిపాదనకు ఈసారైనా  మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
     
    కొయ్యూరు : జిల్లాలో పాడేరు, విశాఖపట్నం, నర్సీపట్నంలో అటవీ డివిజన్లున్నాయి. ముగ్గురు డీ ఎఫ్‌వోలు ఉన్నారు. నర్సీపట్నం డివిజన్‌లో నర్సీపట్నం, కేడీపేట, చింతపల్లి, లోతుగెడ్డ, పెదవలస, ఆర్.వీ నగర్, సీలేరు, మర్రిపాకల రేంజ్‌లున్నాయి. మర్రిపాకల రేంజ్ నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించి ఉంది. అటు సీలేరు కూడా ఎక్కువ దూరంలో విస్తరించింది.

    అంతదూరంలో ఉన్న అడవిని ఒక డీఎఫ్‌వో పర్యవేక్షించడం సాధ్యం కాదు. దీంతో చింతపల్లిని డివిజన్‌గా చేస్తే దాని పరిధిలోకి  సీలేరు, ఆర్.వీ నగర్, పెదవలస, చింతపల్లి, లోతుగెడ్డ రేంజ్‌లను తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ప్రతిపాదించారు. నర్సీపట్నం డివిజన్‌లోకి నర్సీపట్నం, కేడీపేట, మర్రిపాకల రేంజ్‌లను ఉంచుతారు. కిందటేడాది పెదవలసను కొత్త రేంజ్‌గా చేశారు. 52 బీట్లను 116కు పెంచారు. ఫలితంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఇప్పటి వరకు  చింతపల్లిలో ఒక సబ్- డీఎఫ్‌వో ఉంటున్నారు. డివిజన్ అయితే డీఎఫ్‌వో వస్తారు.
     
    పదోన్నతులపై చిక్కులొచ్చే అవకాశం

    ఫారెస్టు సెక్షన్ అధికారి స్థాయి వరకు బదిలీలను డివిజన్ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అటవీ శాఖలో బదిలీలకు జిల్లాను కాకుండా డివిజన్‌ను యూనిట్‌గా పరిగణిస్తారు. కొత్త డివిజన్ ఏర్పాటు చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే తరహా సీనియారిటీ కలిగి ఉంటే ఎవరికి పదోన్నతి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగుల పంపకాల విషయంలోను వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొత్త డివిజన్  ఏర్పాటయితే రేంజ్‌లు వేరు అవుతాయి. రేంజ్ ల్లో పనిచేసే వారు డివిజన్ మారేందుకు ఇష్టపడతారో లేదో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇష్టపడకుంటే వారి కేటాయింపును ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది.
     

మరిన్ని వార్తలు