లోకేష్‌కు ప్రజాక్షేత్రంలో తిరస్కరణ తప్పదు

27 Mar, 2019 11:28 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే)

సాక్షి, మంగళగిరి : అధికార బలంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాజా మాజీ మంత్రి నారా లోకేష్‌ నామినేషన్‌ను ఆమోదింపజేసుకున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం తిరస్కరణ తప్పదని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. మంగళగిరి  తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన జరగ్గా టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ నామినేషన్‌ పత్రాల్లో చేసిన నోటరీపై ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

దీంతో నామినేషన్‌ ఐదు గంటల పాటు పెండింగ్‌లో పెట్టిన అధికారులకు ఉన్నతస్థాయిలో ఒత్తిడి రావడంతో ఆమోదించక తప్పలేదు. అనంతరం ఆర్కే విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో స్థానిక ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేష్‌ నామినేషన్‌ ఆమోదింపజేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఏం మాట్లాడతాడో తెలియని లోకేష్‌ చివరకు నామినేషన్‌ పత్రాలను సమర్పించడంలోనూ తప్పటడుగులు వేసి మరోసారి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవాచేశారు.

తమ అభ్యంతరాలపై సమాధానం చెప్పలేని  లోకేష్‌ న్యాయవాదులు 24 గంటలు సమయం కోరారని, 24 గంటల సమయం గడవకముందే అధికారులు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఆక్రమించుకుని నివాసం ఉంటున్న లోకేష్, చంద్రబాబు అదే ఇంట్లో కూర్చుని కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకున్నారని విమర్శించారు. వాస్తవానికి ఉండవల్లిలో నివాసం ఉంటున్నప్పుడు గుంటూరు జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకోవాలని స్పష్టంచేశారు.

అప్పుడు కూడా ఇక్కడ ఎవరు నోటరీ చేసేవారు లేకపోతే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని కృష్ణాజిల్లా వారితో నోటరీ చేయించుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించారన్నారు. వాస్తవానికి ఎన్నికల అధికారులు నిబంధనలను అమలు చేస్తే నామినేషన్‌ తిరస్కరించాలని, కానీ ఒత్తిడితోనే ఆమోదించారని పేర్కొన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రజాక్షేత్రంలో మంగళగిరి ప్రజల నుంచి తిరస్కరణ తప్పదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు