వెలుగులు నింపిన అవయవ దానం!

7 Mar, 2015 01:48 IST|Sakshi
వెలుగులు నింపిన అవయవ దానం!

సాక్షి, విజయవాడ /మంగళగిరి/చెన్నై/హైదరాబాద్: బ్రెయిన్‌డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు నలుగురికి పునర్జన్మ ప్రసాదించాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆయన కుటుంబీకులు! హుటాహుటిన గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి ఊపిరితిత్తులు, గుండెను చెన్నైకి తరలించారు. హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి కాలేయాన్ని, గుంటూరులోని ఓ ఆసుపత్రికి కిడ్నీలను వేగంగా చేరవేశారు. తన తమ్ముడి అవయవాలను ఇతరులకు అమర్చి వారిలో అతన్ని చూడాలని ఓ అక్క పడిన తపనే అభాగ్యుల బతుకుల్లో వెలుగు నింపింది! విజయవాడలో ఈ నెల 3న సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే మెట్రో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఇదే ఆసుపత్రిలో ఆయన అక్క తోట జ్యోతి నర్సుగా పనిచేస్తోంది. ైవె ద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. తలకు బలమైన గాయం అయినందున బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో  జ్యోతి.. డాక్టర్ శ్రీనివాస్ ద్వారా హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజును సంప్రదించింది. జీవన్‌దాన్ పథకం ద్వారా తమ్ముడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనంతరం మణికంఠను మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించి 25 మంది వైద్యుల బృందం శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4.35 గంటల వరకు ఆపరేషన్ చేశారు. శరీరం నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వేరు చేశారు. ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి అవయవాలను తరలించేందుకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు.
 
 విషయం తెలుసుకున్న విజయవాడవాసులు రహదారికి ఇరువైపులు నిలుచొని అంబులెన్స్‌పై పూల వర్షం కురిపించారు. ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి ఉన్న 33.8 కి.మీ దూరాన్ని అంబులెన్స్ 27 నిమిషాల్లో చేరుకుంది. అక్కడ్నుంచి విమానంలో మణికంఠ గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ఫోర్షియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. మణికంఠ ఒక కిడ్నీని ఎన్నారై ఆసుపత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు సిటీ ఆసుపత్రిలో మరో రోగికి దానం చేశారు. కాలేయాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం జ్యోతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది.
 
 వారిలో నా తమ్ముడు
 బతికుండాలనుకున్నా: జ్యోతి


 
 ‘‘నా తమ్ముడి అవయవాలు దానం చేయాలనుకున్నా. వెంటనే మా అమ్మకు చెప్పా. మెట్రో ఆస్పత్రి న్యూరో సర్జన్ శ్రీనివాసరావు సాయం తో జీవన్‌దాన్ గురించి తెలుసుకున్నా. అరగంటలో వైద్యులు ఆస్పత్రికి వచ్చారు. ఆపరేషన్ చేసి తమ్ముడి అవయవాలు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోయారు. అమ్మ రాధ కూలి పనులు చేస్తుంటుంది. అవయవాలు అమర్చిన వారిలో నా తమ్ముడు బతికుండాలన్నదే నా అభిలాష’’
 

మరిన్ని వార్తలు