ఆ నలుగురికి.. పదవీ గండం!

31 Aug, 2013 23:58 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల రాజకీయ భవితవ్యంపై చర్చ సాగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కనీసం 120 మంది శాసన సభ్యులున్న రాష్ట్రంలోనే శాసన మండలి ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 మాత్రమే. మండలి ఏర్పాటుకు అవసరమైన శాసన సభ్యుల సంఖ్య పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక స్థానం తక్కువగా ఉంది. ఈ నిబంధన అమలైతే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు శాసన మండలి సభ్యులు తమ పదవులను అర్ధంతరంగా వదులుకోవాల్సి ఉంటుంది.
 
 స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి పదవీ కాల పరిమితి 2015 మే నాటికి, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఫారూక్ హుస్సేన్ మే 2017తో ముగుస్తుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సుధాకర్‌రెడ్డి, ఇదే నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటా లో ఎన్నికైన స్వామిగౌడ్ పదవీ కాలపరిమితి 2019 ఏప్రిల్‌లో ముగియనుంది. తెలంగాణ  అసెంబ్లీ ఏర్పాటైతే ఈ నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవుల్లో కొనసాగడం సాధ్యం కాకపోవచ్చు.
 
 భవిష్యత్తు సమీకరణలు..
 టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్‌కు జిల్లా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ కాంగ్రెస్ పక్షా న ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న డీసీసీ అధ్యక్షు డు వి.భూపాల్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్ అర్ధం తరంగా పదవులు వదులుకోవాల్సి వస్తే తమ భవిష్యత్తు రాజకీయ అవకాశాలను ఇప్పటి నుంచే వెతుక్కునే పనిలో పడ్డారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు భూపాల్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నా రు. 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఎన్నికైన విజయశాంతి, ఓటమి పాలైన చాగన్ల నరేంద్రనాథ్ ఇద్దరూ మరోమారు మెదక్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.
 
  భూ పాల్‌రెడ్డి మాత్రం పార్టీ నేతల మద్దతుతో తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందనే భావనలో ఉన్నారు. ఫారూక్ హుస్సేన్ ఎమ్మె ల్సీ పదవిని వదులుకోవాల్సి వస్తే ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి చూపే అవకాశం ఉంది. 1994 లో దొమ్మాట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూక్ పోటీ చేసి ఓటమి పాల య్యారు. పునర్విభజనలో ఏర్పడిన దుబ్బాక నుంచి ఫారూక్ పోటీ చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని పక్షంలో మరోమారు ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
 
 

మరిన్ని వార్తలు