మరో 4 కొత్త ఓడరేవులు

11 Mar, 2020 04:51 IST|Sakshi

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మూడు పోర్టుల నిర్మాణం

మచిలీపట్నం, రామాయపట్నం ఓడరేవుల డీపీఆర్‌లు సిద్ధం 

భావనపాడు పోర్టుకు త్వరలో డీపీఆర్‌ తయారీ 

గ్లోబల్‌ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం 

కేబినెట్‌ నిర్ణయంతో కాకినాడ సెజ్‌లో పోర్టు పనులు ఇక వేగవంతం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఓడరేవులు(పోర్టులు) అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఈ పనుల ప్రక్రియను వేగవంతం చేసింది. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌ సంస్థ నిర్మించ తలపెట్టిన మరో ఓడరేవులో ఆదానీ గ్రూపునకు 49 శాతం వాటా విక్రయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఆ పోర్టు నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి ‘రైట్స్‌’ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఇచ్చిందని, వీటిని క్షుణ్నంగా పరిశీలించి, త్వరలో గ్లోబల్‌ టెండర్లు పిలవనున్నట్లు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు లభించాయని, రామాయపట్నం పోర్టుకు ఈ అనుమతులు రావాల్సి ఉందన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి కొత్తగా డీపీఆర్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేసినట్లు కరికాల వలవన్‌ వెల్లడించారు. 

- మచిలీపట్నం పోర్టును 26 బెర్తులతో 253.20 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మించేలా డీపీఆర్‌ సిద్ధం చేశారు. మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ పోర్టు నిర్మాణానికి రూ.11,924 కోట్లు అవసరమని అంచనా. గతంలో ఈ పోర్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థకు కేటాయించగా.. ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొని, భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రేవు నిర్మాణానికి సంబంధించి ఇంకా 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉంది. 
- రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రూ.10,009 కోట్లు అవసరమని రైట్స్‌ సంస్థ అంచనా వేసింది. మొత్తం 16 బెర్తులతో 138.54 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ఓడరేవును మూడు దశల్లో నిర్మించనున్నారు. ఈ ఓడ రేవు నిర్మాణానికి 3,634.34 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వం చేతిలో 542 ఎకరాలు ఉన్నాయి. ఇంకా 3,093 ఎకరాలను సేకరించాల్సి ఉంది.
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అందుబాటులో ఉండేలా భావనపాడు ఓడరేవు నిర్మించనున్నారు. ఐదు బెర్తులతో 31.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.3,000 కోట్లు అవసరమని అంచనా. గతంలో ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవగా ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఓడరేవును ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించడంతో తాజాగా డీపీఆర్‌ రూపొందించనున్నారు.  

మరిన్ని వార్తలు