ఆధార్ లేకుంటే.. ఉచిత విద్యుత్ కట్..

20 Nov, 2014 02:52 IST|Sakshi
ఆధార్ లేకుంటే.. ఉచిత విద్యుత్ కట్..

ఆధార్ నంబర్ ఇవ్వని రైతుల వ్యవసాయ కనెక్షన్లు నేటి నుంచి కట్ చేసేందుకు రంగం సిద్ధం
క్షేత్రస్థాయి సిబ్బందికి డిస్కమ్‌ల మౌఖిక ఆదేశాలు
7 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ హామీ హుళక్కి
రాష్ట్రంలో 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు
సుమారు ఐదున్నర లక్షల కనెక్షన్లకు కోతే లక్ష్యం
ఆధార్ సమర్పణకు నేటితో ముగియనున్న గడువు
వివరాలివ్వని లక్షలాదిమంది రైతుల్లో ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు వ్యవసాయ కనెక్షన్లకు, ఆధార్‌కు లింకు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు సిద్ధమైంది. ఆధార్ నంబర్ అందజేయని రైతుల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరాను గురువారం నుంచి నిలిపివేయనుంది. కనెక్షన్లు కట్ చేసే ప్రక్రియను గురువారం నుంచే ప్రారంభించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) క్షేత్ర స్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వివిధ కారణాల నేపథ్యంలో ఇప్పటివరకు ఆధార్ నంబర్‌ను సమర్పించని రైతులు ప్రభుత్వ వైఖరితో బెంబేలెత్తిపోతున్నారు. గడువు పొడిగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలకు, ఆధార్‌కు ముడిపెట్టరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అనేక పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన సర్కారు చివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను పరిహారం అందజేతకూ  బాధితులకు ఆధార్ కార్డు ఉండితీరాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పేరుతో పొదుపు చర్యలను చేపట్టిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్లపై కన్నేసింది. రోజుకు 25 నుంచి 35 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉచిత విద్యుత్‌కు వెచ్చించడాన్ని ఆర్థిక భారం కోణంలో చూస్తున్న ప్రభుత్వం వీలైనన్ని కనెక్షన్లకు కోత పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొదలు ఉచిత విద్యుత్ విషయంలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఫీడర్లను విడదీయడంతో పాటు, అన్ని కనెక్షన్లకూ మీటర్లు బిగించే ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇటీవల ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలో కనెక్షన్లకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని కోరింది. దీంతో అధికారులు మొదలు లైన్‌మెన్ల వరకు వినియోగదారులపై ఒత్తిడి పెంచారు. మిగతా కనెక్షన్ల మాటెలా ఉన్నా ఉచిత కనెక్షన్లున్న రైతులు మాత్రం ముందుకు రాలేదు. 7 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అనేకసార్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. కనెక్షన్ల కుదింపు కార్యక్రమాన్ని మాత్రం ముమ్మరం చేసింది. డిస్కమ్‌లు తమ పరిధిలో టార్గెట్లు పెట్టుకుని మరీ ముందుకెళ్తున్నాయి. ఫీడర్ల వారీగా లెక్కలేసిన డిస్కమ్‌లు ఏ రైతు పరిధిలో ఎన్ని మోటార్లున్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏమిటి? పండ్లతోటలు సాగుచేసే రైతుల్లో ఉచిత విద్యుత్ పరిధి నుంచి తప్పించాల్సిన వాళ్ళు ఎవరు? అనే వివరాలు సేకరించారు.

రాష్ట్రంలో 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 11 లక్షల వరకు ఉండగా మిగతావి ఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చాయి. రెండు డిస్కమ్‌ల పరిధిలో.. రకరకాల వడపోతలతో కనీసం 40 శాతం పంపుసెట్లకు (సుమారు ఐదున్నర లక్షల కనెక్షన్లు) ఉచిత విద్యుత్ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎత్తుగడను అమలు చేసేందుకు తన ప్రధాన బ్రహ్మాస్త్రం ఆధార్‌ను తెరపైకి తె చ్చింది. ఆధార్ ఆధారంగా రైతుల ఆదాయం, కుటుంబంలో ఉన్న బహుళ కనెక్షన్లు తదితర వివరాలన్నీ సేకరించడం ద్వారా పరిమితులు విధించి కనెక్షన్లు కట్ చేయాలనేది ప్రభుత్వ యోచనగా అధికారులే చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన తాజా గడువు గురువారంతో ముగియనుంది. అయినా ప్రభుత్వం తమ కనెక్షన్లు కట్ చేస్తుందేమోనన్న ఆందోళనతోనే అధిక సంఖ్యలో రైతులు ఆధార్ లింకేజీకి ముందుకురాలేదు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 60 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో 74 శాతం మంది ఆధార్ సంఖ్యను అనుసంధానం చేశారు. మిగతా 26 శాతంలోని వారిలో ఎక్కువమంది రైతులే కావడం గమనార్హం. ఈపీడీసీఎల్ పరిధిలోనూ సింహభాగం రైతులు ఆధార్ సంఖ్య ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న అధికారులు.. గడువు ముగిసిన వెంటనే డిస్కమ్‌ల ఆదేశాల మేరకు గురువారం నుంచే వీరందరికీ ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

 అవును గడువు ముగిసింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ
 అన్ని విభాగాల మాదిరిగానే తమ శాఖలోనూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశామని, రైతులు దీన్ని అపార్థం చేసుకుంటున్నారని దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సీఎండీ హెచ్.వై.దొర ‘సాక్షి’తో అన్నారు. వాస్తవానికి గత నెలలోనే గడువు ముగిసిందని, హుద్‌హుద్ తుపాను కారణంగా ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆధార్ ఇవ్వనివారికి సరఫరా నిలిపివేయాల్సిందిగా తాము ఎవ్వరికీ అధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. గడువు పొడిగిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.

మరిన్ని వార్తలు