ఉద్యానానికి ఊతం

10 Dec, 2018 11:25 IST|Sakshi

కరువులో ఆదుకుంటున్న పండ్లతోటలు

సింహ భాగం కేంద్ర ప్రభుత్వ నిధులే

రాష్ట్ర ప్రభుత్వ నిధులు అరకొరే 

కడప అగ్రికల్చర్‌ : సంప్రదాయ పంటలతో పోల్చితే పండ్లు, కూరగాయల తోటల నుంచి రైతులకు స్థిరమైన ఆదాయం అందుతోంది. అతివృష్టిŠ, అనావృష్టి పరిస్థితుల ప్రభావం ఉద్యాన పంటలపై అంతగా ఉండకపోవడంతో దిగుబడులకు ఎలాంటి ఢోకా లేదు. రైతులకు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉద్యానశాఖ పండ్లు, కూరగాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో నీటి వనరులున్న బోరుబావుల కింద, నదీతీర ప్రాంతాల రైతులు సూక్ష్మ సేద్యంతో పండ్లు, కూరగాయ తోటలను సాగు చేసుకుని ఆదాయం పొందుతున్నారు. ఉద్యానశాఖ కూడా ఆయా రైతులకు పంటల సాగుపై శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించి సాగుకు చేయూతనిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్‌), రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన ద్వారా నిధులను మంజూరు చేసింది. ఉద్యాన తోటల సాగుకు సింహ భాగం  కేంద్ర ప్రభుత్వ ని«ధులు పథకాలకు సమకూరుతుండగా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక కింద అరకొరగానే నిధులు మంజూరయ్యాయి. రైతులు అనాదిగా వరి, వేరుశనగ, కంది, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసినా వానలు కురవక దిగుబడులు రాక పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ దశలో వ్యవసాయ పంటల నుంచి రైతులు ఉద్యాన పంటల సాగువైపు దృషి సారిస్తున్నారు. 

52817.7 పథక యూనిట్లకు..... రూ.38.03 కోట్లు మంజూరు.. 
జిల్లాలోని ఉద్యానశాఖ–1,2 డివిజన్లలో పండ్లు, కూరగాయతోటలు, పథల్లో ఇతరత్రా ఆర్థిక అవసరాల కోసం నిధుల నివేదికలను తయారు చేశారు. జిల్లా ఉద్యానశాఖ రూ.41 కోట్లు అవసరమవుతాయని ప్రతి పాదనలు పంపగా రూ.38.03 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్‌) కింద రూ.25.70 కోట్ల ని«ధులు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రూ.11 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలో రూ.1.33 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో ఇప్పటికి జిల్లా ఉద్యానశాఖ 1, 2లో 52817.7 యూనిట్లకు రూ.24.46 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాకు మంజూరైన నిధులు ఖర్చు చేయగానే మరిన్ని నిధులు మళ్లీ వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర నిధులు అధికంగా వస్తున్నాయని, రాష్ట్ర నిధులే అరకొరగా ఉంటున్నాయని శాఖలోని కిందిస్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

అరటి, జామ, దానిమ్మ పంటపైనే రైతుల ఆసక్తి.. 
జిల్లాలో కొద్దొ గొప్పో నీటి వనరులున్న ప్రాంతాల రైతులు అరటి, జామ, దానిమ్మ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా రైతులు ఆయా పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తుండడం గమనార్హం. అరటి, జామ, దానిమ్మ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులు ఆ పంటలపైనే దృష్టి సారించారు. జిల్లాలో అరటి 22,641 హెక్టార్లలోను, దానిమ్మ 700 హెక్టార్లు, జామ తోటలు 500 హెక్టార్లలోను సాగయ్యాయి. ఉద్యానశాఖ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు ఆయా పంటలను సాగు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ఎకరాకు ఎంత హీనంగా వేసుకున్నా పెట్టుబడులు, ఇతర ఖర్చులు పోను అరటికి రూ.2 లక్షలు, దానిమ్మకు రూ.3లక్షలు, జామకు రూ.2 లక్షలు ఆదాయం వస్తుండడంతో రైతులు ఆ దిశగా ఆయా పంటలపైనే దృష్టి సారిస్తున్నారు.
 
బిందు సేద్యంతో పంటల సాగు.. 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిందు సేద్యానికి అధిక సబ్సిడీలను ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో రైతులకు పండ్లతోటలకు, కూరగాయ తోటలకు నీటి మడవలు వేసే పద్ధతి లేకుండా పోయింది. బిందు సేద్యంతో కేవలం మోటారు ఆన్‌ చేయగానే అమర్చిన పైపుల నుంచి నీరు లేటర్‌ల ద్వారా చెట్లకు, మొక్కలకు చేరుతుంటాయి. దీంతో రైతులు కేవలం నీరు సక్రమంగా పోతోందా? లేదా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత రైతు పని సులభమైంది. మోటారు ఆన్‌చేసి ఇతరత్రా పొలం పనులు చేసుకోవడానికి ఎంతో వీలుంటోంది. దీనివల్ల రైతులు పండ్లతోటల సాగుకు పూనుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పండ్లతోటల సాగు బాగా పెరిగింది. ఆయా పంటల్లో కలుపు కూడా అంతగా పెరగదు. ఎరువులు కూడా నేరుగా మొక్కలకు, చెట్లకు చేరేలా చేసుకునే వీలుంటోంది.

ఉద్యానశాఖ అమలు చేస్తున్న పథకాల తీరు ఇలా..
 
జిల్లాలో ఉద్యానశాఖ సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం(ఎంఐడీహెచ్‌), రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక పథకాల ద్వారా పండ్లతోటల్లో మొక్కలు నాటుకున్నది మొదలు మూడు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు, పంటల విస్తరణ, సస్యరక్షణ, రక్షిత సేద్యం, నీటి కుంటల(ఫాంపాండ్స్‌) ఏర్పాటు, కోతలో గ్రేడింగ్‌ కేంద్రాలు (ప్యాక్‌ హౌస్‌లు), యాంత్రీకరణ పరికరాలు, కోత అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట ఉత్పాదక సంఘాలు, పాత తోటల పునరుద్ధరణ, కూరగాయల సాగు, ఉతకర్రలతో సాగు, శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయల సాగు, మార్కెట్‌కు పండ్లు, కూరగాయలను చేరవేసే ప్లాస్టిక్‌ క్రేట్స్, చిరు సంచుల విత్తనాలు తదితర పథకాలను అమలు చేస్తున్నారు. వీటిని చిన్న, సన్నకారు రైతులే కాక పెద్ద రైతులు వినియోగించుకుంటూ మంచి దిగుబడులు తీస్తూ ఆదాయం పొందుతున్నారు.     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా