ఏం జనంరా.. బాబూ !

20 Jul, 2015 03:10 IST|Sakshi
ఏం జనంరా.. బాబూ !

 ‘అబ్బో.. ఏం జనంరా బాబూ..! ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు’ తనయుడితో తల్లి. ‘మరేమనుకున్నావ్.. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మన జిల్లాకు 20 లక్షలు దాటిపోయి జనమొచ్చారంట’ తనయుడి సమాధానం. ‘ఆళ్లందర్నీ గోదారమ్మ తల్లి చల్లగా చూడాలి. అందరిళ్లల్లో సిరిసంపదలు బాగుండాలి. ఆడోళ్లంతా  జీవితకాలం సౌభాగ్యంతో బతకాలి. పుష్కరాలకొచ్చినోళ్లంతా సంతోషంగా ఇంటికెళ్లాల’ంటూ గోదారమ్మతోపాటు దేవుళ్లందరినీ ఆ తల్లి ప్రార్థించింది. జిల్లాలో ప్రతిచోట.. ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. జన జాతర నడుమ పుష్కరోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : మఖ నక్షత్రం.. ఆదివారం వేళ పుష్కర సంబరం అంబరాన్ని తాకింది. రెండు రోజులుగా యాత్రికులను నరకయాతనకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను కొంతమేర అధిగమించడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పుష్కర పర్వం ఒకింత సాఫీగానే సాగింది. శనివారం రోజంతా కొవ్వూరు, నరసాపురం పట్టణాలకు కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆగిపోవడం.. యాత్రికులు పుష్కర ఘాట్లకు చేరుకోలేక ప్రత్యక్ష నరకం చవిచూసిన పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచే అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను రాజమండ్రి, కొవ్వూరు వైపు రానివ్వకుండా రావులపాలెం, జొన్నాడ, రాజోలు మీదుగా విశాఖ వైపు మళ్లిం చారు. ఏలూరు-కొవ్వూరు-రాజమండ్రి మార్గంలో వచ్చే భారీ వాహనాలను మళ్లించి ప్రయాణికుల కార్లను, ఆర్టీసీ బస్సులను మాత్ర మే అనుమతించారు.

గుండుగొలను మీదుగా రాజమండ్రి వెళ్లే వాహనాలను జాతీయ రహదారి మీదుగా, కొయ్యలగూడెం నుంచి రాజ మండ్రి వెళ్లే వాహనాలను నాలుగో వంతెన మీదుగా మళ్లించారు. శనివారం ప్రయాణికుల అనుభవాలు, అవస్థలు మీడియాలో హోరెత్తిన నేపథ్యమే కావొ చ్చు గానీ ఆదివారం భక్తుల తాకి డి అంచనాలకు మించి లేదనే చెప్పాలి. పుష్కరాల తొలిరోజు నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వేళల్లోనే పిండప్రదానాలు చేస్తున్నారు. ఆదివారం విపరీతమైన రద్దీ ఉంటుందని భావించిన యాత్రికులు, భక్తులు శనివారం అర్ధరాత్రి కూడా పిండప్రదానాలు చేశారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. కొవ్వూరు ఘాట్లకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.

 బస్సుల కోసం ఎదురుచూపులు
 ఆర్టీసీ బస్సులు అవసరానికి తగ్గ సంఖ్యలో లేకపోవడంతో నరసాపురంలో భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం పుష్కర స్నానాలు పూర్తి చేసుకున్న యాత్రికులు సాయంత్రం వరకు బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం పట్టణంలో ఆదివారం ఏ వీధిలో చూసినా భక్తుల సందడి కనిపించింది. లక్షలాదిగా జనం రోడ్లపైకి రావడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ట్రాఫిక్ విషయంలో ఉన్న ఇబ్బందులను కొంతమేర అధిగమించగలిగారు. వాహనాలను పాలకొల్లు రోడ్డులో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఘాట్ల వద్ద భక్తులు స్నానాల కోసం ఎండలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. దీంతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి దంపతులు నరసారురంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.

 పెరవలిని వదలని ట్రాఫిక్ సమస్య
 పెరవలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోవడంతో భక్తులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు పోలీసులను నియమిం చాల్సిన అవసరం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శాపంగా మారింది. పోలవరంలో లాంచీలు సరిపోక గంటల తరబడి భక్తులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఘాట్ల వద్ద రద్దీ కారణంగా చిన్నపాటి తోపులాటలు చోటు చేసుకున్నాయి. రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడి ఘాట్లను పరిశీలించారు.

 యలమంచిలిలో అదే జోరు
 యలమంచిలి మండలంలో భక్తుల జోరు కొనసాగింది. లక్ష్మీపాలెం ఘాట్‌లో పైకిలేచిన రాళ్లవల్ల భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుష్కర స్నానం ఆచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, రాజమండ్రి ఘటనలో మృతి చెందిన వారికి పిండప్రదానాలు చేశారు. యలమంచిలి ఘాట్‌లో ఓ ముస్లిం కుటుంబం పుష్కర స్నానమాచరించింది. సిద్ధాంతం కేదారీ ఘాట్‌లో వీల్‌చైర్లు లేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.
 
 రాత్రి 8 గంటలకే ఉచిత బస్సులు నిలిపివేత

 పుష్కర యాత్రికుల అవస్థలు
 కొవ్వూరు: పుష్కరాలకు తరలివచ్చే భక్తులను స్నానఘట్టాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు ఉచిత బస్సులను ప్రతిరోజు రాత్రి 8 గంటల తరువాత నిలిపివేస్తుండటంతో భక్తులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం 7నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. కొవ్వూరు ప్రాంతానికి ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రాత్రివేళ ఎక్కువగా వస్తున్నాయి. ఏలూరు, ఖమ్మం ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు సైతం ఎక్కువగా తిరుగుతుంటాయి.

రాత్రివేళ రైళ్లు, బస్సుల నుంచి దిగుతున్న యాత్రికులతోపాటు ప్రైవేటు వాహనాల్లో పార్కింగ్ జోన్లకు చేరుకున్న వారంతా సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం నడిచి పుష్కర ఘాట్లకు చేరుకోవాల్సి వస్తోంది. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయిన యాత్రికులు కాలినడకన ఘాట్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. పగటిపూట 250 ఉచిత బస్సులను నడుపుతున్న ప్రభుత్వం రాత్రివేళ కనీసం వాటిలో సగం బస్సులనైనా ఘాట్లవరకు నడపాలని యాత్రికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు