మలేరియా కార్యాలయానికి గ్రహణం

28 Nov, 2013 02:44 IST|Sakshi

ఉట్నూర్, న్యూస్‌లైన్ :  ప్రభుత్వం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. ఫలితంగా కార్యాలయం ఐటీడీఏపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది దోమల నివారణకు అధికారులు రూ.24లక్షలతో బడ్జెట్ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. సకాలంలో నిధులు విడుదల కాలేదు. దీంతో చేసేదేమీ లేక దోమల నివారణ కోసం ఏటీడీఏను ఆశ్రయించారు. ఐటీడీఏ బడ్జెట్ నుంచి జూలైలో పీవో సుమారు 12.28లక్షలు ముందస్తు రుణంగా ఇచ్చారు. మొదటి విడతగా దోమల నివారణకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు 879 గ్రామాల్లో పిచికారీ చేయించారు. మలివిడత అవసరానికి నెల క్రితం మరో రూ.3లక్షలు తీసుకున్నారు. తీరా ప్రభుత్వం గత నెలలో రూ.12లక్షలు బడ్జెట్ విడుదల చేయడంతో ఆ నిధులను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉండడంతో కార్యాల యంలో మళ్లీ నిధుల కొరత ఏర్పడినట్లయింది.
 ఆశ కార్యకర్తలకు దోమల నివారణ బాధ్యత
 ప్రభుత్వం ప్రతిసారి దోమల నివారణకు స్ప్రే బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించేది. ఈసారి గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు అప్పగించారు. గ్రామాల్లో స్ప్రే కోసం రెండు విడుతలుగా 14టన్నుల ఏసీఎం(ఆల్ట్రా సైప్లోత్రిన్) మందు వచ్చింది. ఏజెన్సీలో పిచికారీ చేయడానికి స్టీరఫ్ పంపులు లేకపోవడంతో ఐటీడీఏ సబ్‌సెంటర్లకు వచ్చే అన్‌టైడ్ నిధుల నుంచి తర్వాత చెల్లించేలా ఒక్కో పంపునకు రూ.3,590 వెచ్చించి 50 కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో గ్రామా ల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దోమల మందు స్ప్రేకు ఇంటికి రూ.14 వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది.
 సిబ్బంది కొరత
 మలేరియా కార్యాలయంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎంవో రెండు పోస్టులు, ఎంపీహెచ్‌ఈవో, హెల్త్‌అసిస్టెంట్, డ్రైవర్, మెకానికల్ అధికారి ఒక్కో పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు 6, ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో జిల్లాలో మలేరియా వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. కార్యాలయానికి వాహ న సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న రెండు వాహనాలు చెడిపోయా యి. కార్యాలయ అవసరాలకు కొత్త వాహనం కావాలని 2008 నుంచి అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.  
 దోమతెరలజాడే లేదు
 జిల్లాలో రోజురోజుకు మలేరియా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 2008 నుంచి జిల్లాలో దోమతెరల పంపిణీ నిలిచిపోయింది. గతంలో ఇచ్చిన 84 వేల తెరలు మినహా ఇప్పటికీ పంపిణీ లేకుండా పోయింది. మూడేళ్లుగా జిల్లా అధికారులు లక్షా 65 వేల దోమతెరలు కావాలంటూ ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలే అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వియాత్నం నుంచి పది లక్షల దోమతెరలు తెప్పించి పంపిణీకీ శ్రీకారం చుట్టినా ఆదిలాబాద్ జిల్లాను విస్మరించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఖమ్మం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు పంపిణీ చేసింది.

మరిన్ని వార్తలు