పథకం ఒకటే.. ప్రయోజనాలు రెండు

30 Oct, 2023 07:13 IST|Sakshi

పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్

వేతన జీవులు సెక్షన్‌ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల పన్ను ఆదా కోసం సంప్రదాయ సాధనాలైన బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్, బీమా పాలసీలు, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌ఈ తదితర సాధనాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికంటే కూడా దీర్ఘకాలానికి పన్ను ఆదా సౌలభ్యంతో కూడిన ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు రాబడుల దృష్ట్యా ఎంతో మెరుగైనవి. కనీసం ఐదేళ్లు, అంతకుమించి దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగించే సౌలభ్యం ఉన్న వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులపై రెండంకెల స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు ఉన్నప్పుడే సంపద సృష్టి సాధ్యపడుతుంది. మరి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇచ్చేవి ఈక్విటీ సాధనాలే. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో పరాగ్‌ పారిఖ్‌ ట్యాక్స్‌సేవర్‌ కూడా ఒకటి. 

రాబడులు
ఈ పథకం 2019 జూలై 24న ఇది ప్రారంభమైంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సగటు వార్షిక రాబడులు 21 శాతానికిపైనే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో 12 శాతం, ఏడాది కాలంలో పెట్టుబడిపై 13.55 శాతం రాబడిని ఈ పథకం తెచ్చిపెట్టింది. పరాగ్‌ పారిఖ్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌కు.. ఈ రంగంలో ఎంతో పేరున్న రాజీవ్‌ ఠక్కర్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ పథకాన్ని సైతం ఆయనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 22 శాతానికి పైనే రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథ కం ఎక్స్‌పెన్స్‌ రేషియో (పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఏటా చెల్లించాల్సిన మొత్తం) 1.86 శాతంగా ఉంది.  

పెట్టుబడుల విధానం..  
ఈ పథకం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అనుసరిస్తుంది. వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానంలో స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. కనీసం 80 శాతం పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మరో 20 శాతం మేర పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. మంచి యాజమాన్యం, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధిని చూపించే కంపెనీలను ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు వాటిల్లో పెట్టుబడులను కొనసాగిస్తుంది. 

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అమలవుతుంది. మూడేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కూడా పెట్టుబడులు, రాబడుల స్థిరత్వానికి అనుకూలించే అంశమే. ఈ పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో లాభం రూ.లక్షకు మించి ఉన్నట్టయితే.. రూ.లక్షకు మించి ఉన్న మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల నుంచి ఆశించొచ్చు.  

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2065 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. డెట్‌ సాధనాల్లో 15 శాతం పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నగదు నిల్వలు పెద్దగా లేవు. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై, ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తే, అప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని ఈక్విటీలకు కేటాయింపులు పెంచుతుంది. పెట్టుబడుల పరంగా ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటోమొబైల్‌ రంగ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. 50  శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీలకే కేటాయించింది.

మరిన్ని వార్తలు