పత్తాలేని మాటల ‘పవనం’

21 May, 2019 10:37 IST|Sakshi

సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: మీరు ఎండలో మాడిపోతుంటే నేనూ మీతో పాటే మాడిపోతాను కానీ.. రూముల్లో కూర్చోను.మీరు వర్షంలో తడుస్తుంటే  నా గొడుగు విసిరేసి నేనూ మీతోనే ఉంటా.. 
ఎలక్షన్ల కోసమే రాజకీయాలు కాదు.. ప్రజాసమస్యలపై పోరాడటం కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను.. రాజకీయాలు మార్చేస్తాను.. ఇవన్నీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ముందు.. సరిగ్గా చెప్పాలంటే పోలింగ్‌ కు ముందు వీరావేశంతో వల్లించిన డైలాగులు.

పవన్‌ సినిమాటిక్‌ డైలాగులకు, చేతలకు ఎంత వ్యత్యాసముందో గాజువాకలో వాస్తవ పరిస్థితులను చూస్తేనే అర్ధమవుతుంది. గాజువాకతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. కేవలం కులలెక్కలతోనూ, 2009లో పీఆర్పీ నుంచి చింతలపూడి వెంకట్రామయ్య గెలుపును బేరీజు వేసుకుని పవన్‌ గాజువాకపై వాలిపోయారు. కనీసం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనైనా గాజువాక సమస్యలపై దృష్టి పెట్టి ఇక్కడి ప్రజలతో మమేకమవుతారని అభిమానులు, రాజకీయ పరిశీలకులు ఆశించారు.  కానీ ఆయన ఇక్కడి ప్రజల సమస్యలపై ఏమాత్రం అవగాహన తెచ్చుకోలేకపోయారు. వేలాది పుస్తకాలు చదివానని గొప్పగా చెప్పుకునే ఆయన గాజువాకలోని ప్రధాన మౌలిక సమస్యల పరిష్కారం గురించి కూడా చెప్పలేకపోయారు. సినీ డైలాగుల మాదిరిగానే ఉద్యోగాల కల్పనపై, సాధ్యం కాని అగనంపూడి రెవెన్యూ డివిజన్‌ వంటి హామీలు గుప్పించడం తప్పించి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక ప్రణాళికను కూడా వెల్లడించలేకపోయారు. స్థానికేతర వివాదం తెరపైకి వచ్చినప్పుడు కూడా తాను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాననే ప్రకటన కూడా చేయలేకపోయారు. గాజువాక వై జంక్షన్‌లోని కర్ణవానిపాలెంలో అద్దె ఇల్లు తీసుకున్నానని ఆర్భాటం చేసి ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో బస చేయలేకపోయారు. పోనీ కనీసం గాజువాక మొత్తం కలియతిరిగారా.. ప్రచారమైనా పక్కాగా నిర్వహించారా... అంటే అదీ లేదు. నామినేషన్‌కు ముందు ఓసారి.. ఆ తర్వాత ఓసారి.. మొత్తంగా మూడుసార్లు మాత్రమే  గా>జువాకలో పర్యటించారు. పోలింగ్‌కు ముందు రోజైనా పవన్‌ ఇక్కడికి వస్తే బాగుంటుందని అభిమానులు ఆశించినా.. పవన్‌ అవేమీ లెక్కచేయలేదు. ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాల్సి వచ్చిన నేపథ్యంలో గాజువాకకు రావడం కుదరలేదేమోనని అభిమానులే పాపం సరిపెట్టుకున్నారు. 

ఆత్మీయ సమావేశానికీ రాలేదు... 
ఇక మేడే రోజు పార్టీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికైనా పవన్‌ వస్తారని  అభిమానులు, పార్టీ నేతలు భావించారు. కానీ ఆ సమావేశానికి కూడా డుమ్మా కొట్టి తన సోదరుడు నాగబాబును పంపించారు. ఆ సమావేశంలోనే నాగబాబు శృతిమించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలా పోటీ చేసి.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయిన అభ్యర్ధి  జిల్లాలో మాత్రం పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా అడపాదడపా కానవొస్తు న్నా... పవన్‌ మాత్రం ఇంకా సేదతీరుతూనే ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటానన్న పవన్‌ 
గాజువాకకు వచ్చిన సందర్భంలో ఓసారి పవన్‌ నెలలో ఎక్కువ రోజులు తాను ఇక్కడే ఉంటానని ప్రకటించారు.  కానీ ఎన్నికలైన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గాజువాక వైపు కన్నెత్తిచూడకపోవడమే ఇప్పుడు విమర్శలపాలవుతోంది.  పోలింగ్‌కు, కౌంటింగ్‌కు తక్కువ రోజుల వ్యవధి ఉంటే ఈ తరహా విమర్శలు వచ్చేవి కావు. కానీ మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్‌కు,. కౌంటింగ్‌కు 42రోజుల గ్యాప్‌ వచ్చింది. దీంతో మధ్యలో పవన్‌ తప్పకుండా గాజువాక వస్తారని భావించారు. పోలింగ్‌కు ముందు కుదరకపోవడంతో ఆ తర్వాతైనా వచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తారని చాలామంది ఆశించారు. పార్టీ శ్రేణులైతే.. నియోజకవర్గ సమీక్ష ఇక్కడే నిర్వహిస్తారని లెక్కలు వేశారు. కానీ పవన్‌ ఎన్నికల తర్వాత ఎక్కడా గాజువాక ప్రస్తావన కూడా తేలేదు. 

మరిన్ని వార్తలు