వీడని జియోట్యాగ్ ముడి

13 Feb, 2015 01:37 IST|Sakshi
వీడని జియోట్యాగ్ ముడి

వీరఘట్టం : జియో ట్యాగింగ్ పేరుతో ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను అవస్థల పాల్జేస్తోంది. నాలుగు నెలలుగా ఇదే సాకుతో కొత్త ఇళ్లు మంజూరు చేయక, కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు చేపట్టండి బిల్లులు చెల్లిస్తామన్న అధికారుల భరోసాతో అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లులు మంజూరు కాక, నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ఏడాది మార్చి 23 నుంచి ఎన్నికల కోడ్ అంటూ ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్ స్వగృహ ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఏడు నెలలు దాటినా.. ఇంతవరకు ఆ పథకం ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో అక్రమంగా ఇందిరమ్మ గృహాలు పొందిన వారిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది జరిగే పరిస్థితి కనిపించడంలేదు.
 
 65 శాతం పూర్తి
 జిల్లాలో ప్రభుత్వ పథకాల కింద 2.64 లక్షల గృహాలు ఉండగా 65 శాతం అంటే 1.80 లక్షల గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చే స్తామని అధికారులు చెబుతున్నారు. కాగా 2.64 లక్షల ఇళ్లలో సుమారు 2.40 లక్షల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 24 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి చెల్లింపు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమిలో ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లా వ్యాప్తంగా 43 వేలు దరఖాస్తులు, అలాగే ప్రజావాణి ద్వారా మరో 94 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జన్మభూమి వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి.  
 
 పెరుగుతున్న ధరలు
 సిమెంట్, ఇనుము ఇతర సామాగ్రి ధరలు పెరుగుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బిల్లులు అందక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయిస్తే గాని ప్రభుత్వ ధ్యేయం నెరవేరదని లబ్ధిదారులు అంటున్నారు.
 
 ప్రభుత్వ సాయం పెంచాలి
 ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్న ప్రభుత్వ సహాయం ఏ మూలకు చాలడం లేదు. కనీసం 2 లక్షల రూపాయలైనా ఇవ్వందే ఇల్లు కట్టడం అసాధ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే నిర్మాణాలు పూర్తవుతాయి. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి.
 -వెలగాడ చిన్నమ్మ, కంబరవలస
 
 ధరలను అదుపు చేయాలి
 సిమెంట్, ఇనుము ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రోజురోజుకి పెరిగిపోతున్న వీటి ధరలను ప్రభుత్వం అదుపు చేయాలి. వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముతున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలి.
 -రెట్టి కమల, వీరఘట్టం
 

మరిన్ని వార్తలు