క్యూఆర్‌ కోడ్‌ బందోబస్త్‌ 

24 Sep, 2023 02:29 IST|Sakshi

ప్రతి గణేష్‌ మండపానికి జియో ట్యాగింగ్‌ 

రూట్‌ మ్యాప్, చెరువులు, ట్రాఫిక్‌ రద్దీ అన్నీ నిక్షిప్తం 

నిరంతరం నిమజ్జనం తీరు పర్యవేక్షణ 

ఆకతాయిలపై నిఘా కోసం రంగంలోకి షీ టీమ్స్‌ 

సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలోని చెరువులు, రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్‌ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ను ఇచ్చారు.
 
ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్‌ మ్యాప్‌ వంటి వివరాన్నీ ఈ కోడ్‌లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్‌ చేశారు. వీటిని ఈ క్యూఆర్‌ కోడ్‌కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్‌ కోడ్‌లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్‌ టైంలో తెలిసిపోతాయి. 

ఆకతాయిలపై షీ టీమ్స్‌ నిఘా.. 
సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్‌ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు