స్పెయిన్‌ ప్రధానిగా మళ్లీ పెడ్రో సాంచెజ్‌

17 Nov, 2023 05:46 IST|Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్‌ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్‌ అధిష్టించనున్నారు. గురువారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. కేటలోనియా వేర్పాటు ఉద్యమ నేత చార్లెస్‌ పిడ్గెమాంట్‌కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్‌ అంగీకరించడం.. బదులుగా వేర్పాటువాద పార్టీలు ఆయన ప్రభుత్వంలో చేరేందుకు అంగీకరించడంతో మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

నూతన ప్రభుత్వంలో రెండు కేటలోనియా వేర్పాటువాద పార్టీలు సహా మొత్తం ఆరు చిన్న పార్టీలు భాగస్వాములు కానున్నాయి. జూలై 23న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 2017లో స్పెయిన్‌ నుంచి విడిపోతున్నట్లు కేటలోనియా వేర్పాటువాదులు ప్రకటించడంతో దేశంలో సంక్షోభం ఏర్పడింది. వేర్పాటువాద నేత చార్లెస్‌ పిడ్గెమాంట్‌ను ప్రభుత్వం నేరగాడిగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు