ఓటు వేయాలంటే బోటు ఎక్కాల్సిందే..

27 Mar, 2019 07:11 IST|Sakshi
కొల్లూరు, పేరంటపల్లి గ్రామాలకు వెళ్లాలంటే ఈ బోట్లే ఆధారం

ఆ గ్రామాలకు వెళ్లాలంటే రహదారి సౌకర్యాలు లేవు, ఎటు వెళ్లాలన్నా గోదావరిలోనే ప్రయాణించాలి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాటు పడవలు, బోట్‌లలో పోలింగ్‌ కేంద్రానికి రావాలి. ఒడ్డుకు చేరుకున్న తర్వాత కాలినడకన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకొని మళ్లీ తిప్పలు పడుతూ గమ్యస్థానానికి చేరాల్సి ఉంటుంది. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని పోలవరం, వేలేరుపాడు, వీఆర్‌పురం మండలాల్లో గోదావరీ పరీవాహక ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. 


పడవలపై వచ్చి ఓటేయాల్సిందే 
గోదావరి ఒడ్డు గ్రామాల్లో 893 మంది ఓటర్లున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు పోలింగ్‌ కేంద్రానికి రావడానికి దారిలేక ఓటుకు దూరంగా ఉంటున్నారు. వేలేరుపాడు మండలంలోని 407 మంది ఓటర్లు జలమార్గం గుండా వచ్చి ఓటు వేయాల్సి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు గ్రామంలో 169 మంది ఓటర్లున్నారు. వీరు ఓటువేయాలంటే  2 కిలోమీర్ల మేర కాలినడకన ప్రయాణించి, ఆ తర్వాత నీళ్లల్లో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొయిదా పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గ్రామంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో  దానిని కొయిదాకు మార్చారు. ప్రస్తుతం మళ్లీ కాకిస్‌నూరు గ్రామంలో పోలింగ్‌  కేంద్రం ఏర్పాటు చేశారు. 


వి.ఆర్‌.పురం మండలం కొల్లూరు, కొండేపూడి, గొందూరు, గ్రామాల్లో 460 మంది ఓటర్లుండగా పురుషులు 240, మహిళలు 220 మంది ఉన్నారు. వీరంతా తుమ్మిలేరు పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవాలి. కొల్లూరు నుండి తుమ్మిలేరు పోలింగ్‌ కేంద్రం పది కిలోమీటర్ల దూరంలో ఉండగా, కొండేపూడి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరికి గోదావరి తప్ప వేరే దారి లేదు.  గోదావరిలో దోనెలపై దాటి కాలినడకన ప్రయాణించాలి. పోలవరం మండలంలోని తెల్లదిబ్బలలో 26 మంది ఓటర్ల పరిస్ధితి కూడా ఇంతే. నిబంధనల ప్రకారం ఓటర్లను రాజకీయ పార్టీలు పోలింగ్‌ కేంద్రానికి తరలించకూడదు. ఈ గ్రామాల ఓటర్ల కోసం అధికారులే బోట్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

  
అధికారులకూ అవే తిప్పలు
దట్టమైన కీకారణ్యంలో కాకిస్‌నూరు గ్రామం ఉంది. మారుమూల అటవీ ప్రాంతానికి పోలింగ్‌ అధికారులు వెళ్లడం కూడా సాహసమే అని చెప్పాలి.  పేరంటపల్లిలో ఉన్న 107 మంది ఓటర్లు, టేకుపల్లిలో 131 మంది ఓటర్లు, చినమంకోలు, పెదమంకోలు గ్రామాల్లోని  ఓటర్లు కూడా నాటుపడవపై వచ్చి కాకిస్‌నూరులో ఓటు వేయాలి. అధికారులు  కొయిదా నుంచి నదీ మార్గం గుండా బోట్‌పై వెళ్లి పోలింగ్‌ కేంద్రాన్ని చేరుకోవాలి. 

>
మరిన్ని వార్తలు