బాబోయ్‌.. భూతాపం

7 Nov, 2019 05:04 IST|Sakshi

నానాటికీ విపరీతంగా పెరుగుతున్న కాలుష్యమే కారణం

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని టీసీడీ అధ్యయనంలో వెల్లడి

అటవీ విస్తీర్ణం పెంచడమే పరిష్కార మార్గమంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: ప్రకృతితో మనుషులు ఆడుతున్న చెలగాటం భవిష్యత్తు తరాలకు ప్రాణసంకటంగా మారుతోంది. భూమండలాన్ని అమాంతం కమ్మేస్తున్న కర్బన ఉద్గారాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. యథేచ్ఛగా అడవుల నరికివేత.. మితిమీరిన వాహనాల వినియోగం.. విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ వంటివి పర్యావరణాన్ని కబళిస్తున్నాయి.  భూతాపం వల్ల 2100 సంవత్సరం నుంచి భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశాలున్నాయని తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలోని టాటా సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌తో(టీసీడీ) కలిసి క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఆరు రాష్ట్రాలు తీవ్ర విపత్తును ఎదుర్కోక తప్పదని ఈ అధ్యయనంలో వెల్లడికావడం గమనార్హం.  భూతాపం వల్ల దేశంలో ఏటా సంభవించే 15 లక్షల మరణాల్లో 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో 4,02,280, బిహార్‌లో 1,36,372, రాజస్థాన్‌లో 1,21,809, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(ఏపీ, తెలంగాణ) 1,16,920, మధ్యప్రదేశ్‌లో 1,08,370, మహారాష్ట్రలో 1,06,749 మరణాలు సంభవిస్తాయని బహిర్గతమైంది. 

ఆందోళనకరంగా ఏపీ పరిస్థితి 
2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరుగుతాయని క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శేషాచలం, నల్లమల వల్ల చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత అదుపులో ఉంటాయి. తూర్పు కనుమలు ఉన్నందున ఉత్తరాంధ్రలో కొంత సానుకూలంగా ఉంటుంది. కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలుంటాయి. కోనసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. సముద్ర తీరం వెంట మట్టి క్షయం తప్పదు. భారీగా తీరం కోతకు గురవుతుంది. కోనసీమ తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నాయి. సముద్ర నీటి మట్టం పెరగడంతో కృష్ణా, గోదావరి డెల్టాలు తీవ్రంగా నష్టపోతాయి.  

అడవి తల్లే ఆపద్బాంధవి
భూతాపం తగ్గించేందుకు రాష్ట్రమంతా సతతహరిత వనంగా ఉండేలా చూడాలి.  పంటల మార్పిడి చేయాలి. ఉద్యానవన వ్యవసాయ విధానాలు అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. తీరప్రాంతం నుంచి 300 మీటర్లు వరకు మడ అడవులను అభివృద్ధిపరచాలి. 

కార్బన్‌ డయాక్సైడ్‌ కుంపటి 
ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో ఏటా 67 రోజులు 35 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో ఇది 42.50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని అంచనా. 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్‌ కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి 408.55 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌గా(పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు, 2100 నాటికి 940 పీపీఎంకు చేరుకోనుంది. 

అడవుల పెంపకంతోనే...
‘‘భూతాపం పెరగడం మానవాళికి తీవ్రనష్టం కలిగిస్తుంది. భూతాపం తగ్గించేందుకు అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే ఏకైక పరిష్కార మార్గం. ప్రస్తుతం రాష్ట్రంలో 24 శాతం అటవీ ప్రాంతం ఉంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండేలా చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అడవుల నరికివేతను అడ్డుకోడానికి కఠిన చర్యలు చేపట్టాలి. బయోడైవర్సిటీ రిజిస్టర్‌ను కచ్చితంగా అమలు చేసి, పర్యావరణాన్ని పరిరక్షించాలి’’ 
– టి.బైరాగిరెడ్డి, ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ 

తీరప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తేవాలి  
‘‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. అందుకోసం తీర ప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా తుఫాన్లు, తీరం కోత, మట్టి క్షయం వంటి ఉత్పాతాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు’’ 
– మనోజ్‌ నగనాగుల, పర్యావరణవేత్త  

మరిన్ని వార్తలు