ఎందుకో.. ఇది ఎందుకో?

4 May, 2015 03:33 IST|Sakshi
ఎందుకో.. ఇది ఎందుకో?

జంగారెడ్డిగూడెం రూరల్ :పుష్కర నిధులతో గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్లన్నీ శోభాయమానంగా తీర్చిదిద్దుతారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. పాడైన రోడ్లను కాకుండా బాగున్న వాటిపై లేయర్లు వేసి నిధులను వృథా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుష్కర నిధుల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.50 లక్షలు, అర్‌అండ్‌బీ శాఖ పరిధిలో జంగారెడ్డిగూడెం పరిసరాల్లో రోడ్ల నిర్మాణాలకు మరికొన్ని నిధులు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి మంజూరైన రూ.2 కోట్లతో జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉన్న రోడ్డుపై లేయర్ నిర్మాణ పనులు చేపట్టారు.
 
 అయితే పట్టణంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం వెళ్లే దారి మరింత అధ్వానంగా మారింది. దీంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారిలోనే ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు వైద్యసేవలు అందించేందుకు నిర్మిం చిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, రవాణాశాఖ అధికారి కార్యాలయం, సబ్ ట్రెజరీ, రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే రోగులు ఈ రోడ్లో పడుతూ, లేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల  ఒక గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో గోతులమయంగా ఉన్న రోడ్డు వల్ల ఆటోలోనే ప్రసవం జరిగింది.
 
 అనేకమార్లు ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించుకున్నా పట్టించుకున్న అధికారులు లేరు. ఆర్టీవో కార్యాలయం నుంచి అశ్వారావుపేట రోడ్డులో ఉన్న కాకర్ల కాంప్లెక్స్ వరకు ఉన్న రోడ్డు కూడా  అధ్వానంగా తయారైంది. ఈ రెండు రహదారులలో ఎక్కువగా వాహనాలు తిరుగుతుంటాయి. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రహదారుల మరమ్మతులను విస్మరించారంటూ పట్టణవాసులు అధికారులు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోతులమయంగా మారిన రోడ్లకు నిధులు వెచ్చించి పనులు చేపట్టి ఉంటే పట్టణానికి కొత్తశోభ తీసుకువచ్చేదని ప్రజలు పేర్కొంటున్నారు.
 
 బాగున్న రోడ్డుపై లేయరా?
 జంగారెడ్డిగూడెం నుంచి దేవులపల్లి వరకు ఉన్న రోడ్డుపై లేయర్ నిర్మాణానికి రూ.2 కోట్లు పుష్కర నిధులు కేటాయించారు. అయితే ఈ రోడ్డు నిర్మాణంపై స్థానికుల నుంచే విమర్శలు వస్తున్నాయి. బాగున్న రోడ్డుపై లేయర్ నిర్మాణానికి నిధులు వెచ్చించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేవులపల్లి నుం చి జంగారెడ్డిగూడెం బస్టాండ్, గంగానమ్మగుడి, కొవ్వూరు రోడ్డు కొంతమేర ఈ లేయర్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే గతంలో ఈ రోడ్డు బాగానే ఉంద ని, ఈ నిధులను ఇలా వృథాగా ఖర్చుచేసే కన్నా, గంగానమ్మగుడి నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న రోడ్డు, పాడైన రోడ్లను అభివృద్ధి చేసి ఉంటే బాగుండేదని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. పుష్కర నిధులతో జంగారెడ్డిగూడెంలో ఏదో పనులు చేస్తున్నామన్న ఆ ర్భాటానికే హడావుడిగా నిర్వహిస్తున్నార ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
  నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దుతామని ప్రారంభించిన అశ్వారావుపేట రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. ఈ పనులకు ఆర్‌అండ్‌బీ శాఖ 2012లో శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు కల్వర్టు నిర్మాణంతో పాటు ఒక పక్క డ్రెయినేజీ ని ర్మాణ పనులు మాత్రమే జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి 6.08 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనుల్లో భాగంగా భగత్‌సింగ్ సెంటర్ నుంచి హైస్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొల గించారు. నిర్మాణానికి ఇప్పటి వరకు కోటిన్నర ఖర్చు అయిందని ఆర్‌అండ్‌బీఅధికారులు చెబుతున్నారు. అయితే పనులను అర్ధంతరంగా నిలిపివేయడం తో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన డ్రెయిన్లు, కల్వర్టులు నిరుప యోగంగా మారాయి.
 

మరిన్ని వార్తలు