గ్రాంట్ల రూపంలో రూ.2,19,695 కోట్లు కావాలి

7 Dec, 2019 04:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇచ్చేలా సిఫారసు చేయండి

15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన తాజా నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వినతి 

విభజన అనంతరం  భారీ రెవెన్యూ లోటు 

మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరం

సాక్షి, అమరావతి: విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది. గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నిధుల అవసరానికి సంబంధించి కొంత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

తాజాగా మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. గత ప్రభుత్వం భారీగా పెండింగ్‌ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్‌కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

మరిన్ని వార్తలు