చిలక్కొట్టుడు!

2 Dec, 2018 09:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పర్యాటక సంస్థలో నిబంధనలకు నీళ్లొదిలిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి ఖర్చు చేయాల్సిన నిధులు తమ వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతిని ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా కొనసాగుతోంది.  

సొంత కార్యక్రమాలకు పర్యాటక సంస్థ భోజనాలు.. 
పర్యాటకులకు కావాల్సిన భోజనాలను పున్నమి రెస్టారెంట్‌లో తయారు చేస్తారు. పర్యాటకులు ముందుగా సొమ్ము చెల్లిస్తే అక్కడ వంటలు వండించుకుని బయటకు తీసుకెళ్లవచ్చు. దీన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని పర్యాటక సంస్థ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. గతంలో పర్యాటక సంస్థలో ఓ ఉన్నతాధికారి భార్యకు సీమంతం జరిగింది. దీనికి పున్నమి రెస్టారెంట్‌ నుంచి భోజనాలు వెళ్లాయి. ఈ భోజనాలు భవానీద్వీపం, బరంపార్కుకు వచ్చిన పర్యాటకులకు ఖర్చు చేసినట్లుగా చూపించారు. అయితే ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో చివరకు ఆ అధికారి భోజనాలకు అయిన ఖర్చును పర్యాటక సంస్థకు చెల్లించి రసీదు తీసుకున్నారు. 

అప్పట్లో ఆ అధికారి ఇంట్లో శుభకార్యానికి భోజనాలు పంపి స్వామి భక్తి ప్రదర్శించిన ఒక మేనేజర్‌ ఇంట్లో ఇటీవల ఒక శుభకార్యం జరిగింది. ఆ మేనేజర్‌ కుమార్తె జన్మదిన వేడుకలను గత నెలలో భవానీపురంలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆ ఫంక్షన్‌కు కావాల్సిన భోజనాలన్నీ పున్నమి రెస్టారెంట్‌ నుంచే వెళ్లాయి. రెండు నాన్‌వెజ్‌ రకాలతో సుమారు 200 మందికి భోజనాలు వెళ్లాయని పర్యాటక సంస్థ సిబ్బంది చెబుతున్నారు. కనీసం లక్షన్నర విలువ చేసే ఈ భోజనాలకు  అయిన ఖర్చు పర్యాటక సంస్థ ఖాతాలో వేశారు. ఇటీవల పున్నమి ఘాట్‌లో ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటింగ్‌ ఫార్ములా రేస్‌ జరిగింది.

 ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందల మందికి భోజన, వసతి ఏర్పాట్లను పర్యాటక సంస్థ కల్పించింది. దీంతో అంతకు ముందు జరిగిన జన్మదిన ఖర్చులను ఆ మేనేజర్‌ ఇందులో కలిపేశారని సిబ్బంది నుంచి తెలుస్తోంది. తన జేబులో రూపాయి ఖర్చు కాకుండా కుమార్తె జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించడం ఇప్పుడు బరంపార్కులో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పర్యాటక సంస్థ ఉన్నతాధికారికి తెలిసినా  మిన్నకుండటం గమనార్హం.  

ఖర్చుకు.. లెక్కకు పొంతన కరువు  
పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో పెద్దపెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు పెట్టే ఖర్చులకు, చూపే లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు వచ్చినప్పుడు వారి వెంట వచ్చిన వారికి కావాల్సిన భోజనాలు కూడా పర్యాటక సంస్థ కల్పిస్తుంది. ఆ సమయంలో భోజనాలు చేసిన వారికి మరో 50 శాతం ఎక్కువ మంది తిన్నట్లుగా చూపించి ఆ సొమ్ము పంచుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి అధికారులకు వరంగా మారిందని కింది స్థాయి సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.  

మరిన్ని వార్తలు