మందేసి చిందేయమని..

24 Dec, 2018 03:37 IST|Sakshi

మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం విచ్చలవిడి అనుమతులు

పూర్తిస్థాయి నిబంధనలు రూపొందించకుండానే లైసెన్సులు

అన్ని నగరాల్లో బీరు, వైన్‌ పార్లర్ల ఏర్పాటుకు పోటీపడుతున్న సిండికేట్లు

ఆల్కహాల్‌ మోతాదు ఎంతో ఎక్సైజ్‌ శాఖకే లేని సమాచారం

నిబంధనలకు విరుద్ధంగా క్లబ్‌లలో మద్యం అమ్మకాలకు లైసెన్సులు

మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేయడమే లక్ష్యం  

సాక్షి, అమరావతి: కొత్త ఏడాదిలో రెడీ టూ డ్రింక్‌ పేరిట బీరు, వైన్‌ అమ్మకాల జోరు పెంచేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇందుకోసం మైక్రో బ్రూవరీ బార్లకు తలుపులు బార్లా తెరిచింది. ప్రజల్ని మత్తులో ముంచి ఖజానా నింపుకునేందుకు ప్రధాన నగరాల్లో బీరు, వైన్‌ పార్లర్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చేస్తోంది. పాశ్చాత్య సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్దే ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 బార్లు సరిపోవన్నట్లు మైక్రో బ్రూవరీల కోసం అధికార పార్టీ నేతలు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖల్లో మైక్రో బ్రూవరీలకు ఎక్సైజ్‌ శాఖ అనుమతులిచ్చింది. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి నగరాల్లో బీరు, వైన్‌ పార్లర్లను ఏర్పాటు చేసేందుకు మద్యం సిండికేట్లు పోటీలు పడుతున్నారు. బీరు, వైన్‌ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఈ ర్యాంకును అధిగమించేందుకు ఏపీలో బీరు అమ్మకాలు పెరిగేలా ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటుకు అనుమతులివ్వాలని సర్కారు ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

బార్‌ పాలసీలో భాగంగా ఐదేళ్ల పాటు లైసెన్సులు కట్టబెట్టిన సర్కారు.. బీరు, వైన్‌ పార్లర్లకు శాశ్వత లైసెన్సులు జారీచేసే ఆలోచన చేస్తున్నట్లు ఎక్సైజ్‌ వర్గాలే వెల్లడించడం గమనార్హం. గతేడాది మద్యం పాలసీ రూపొందించినప్పుడే మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వం రూపొందించింది. ఆహారం సరఫరా చేసే ఏ ప్రాంతంలోనైనా బీర్, వైన్‌ పార్లర్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పాలసీ తయారు చేసింది. అయితే ఇంతవరకు మైక్రో బ్రూవరీలపై నిబంధనలు రూపొందించలేదు. అయినప్పటికీ విజయవాడ, విశాఖలలో బ్రూవరీలను ఏర్పాటు చేశారు. ఈ బీర్, వైన్‌ పార్లర్లలో రెడీ టూ డ్రింక్‌లుగా మద్యం ఉత్పత్తుల్లో ఆల్కహాల్‌ శాతం ఏ మోతాదులో కలుపుతున్నారో, ఏ విధంగా అమ్మకాలు చేపడుతున్నారో ఎక్సైజ్‌ శాఖ వద్దే సమాచారం లేకపోవడం గమనార్హం. టూరిజంప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేసుకునే క్లబ్‌లలో మద్యం విక్రయించేందుకు అనుమతులివ్వాలని ఎక్సైజ్‌ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోకుండా క్లబ్‌లు ఏర్పాటు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో క్లబ్‌ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతులిచ్చారు. ప్రభుత్వ తీరుపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు