బలవంతంగానైనా భూములు లాక్కోండి

3 Oct, 2017 04:35 IST|Sakshi

ఎన్‌హెచ్‌–216 విస్తరణలో సర్కారు ఆదేశాలు

కత్తిపూడి–కాకినాడ మార్గంలో భవనాలకు అసంబద్ధంగా రేటు నిర్ణయం

బైపాస్‌ల నిర్మాణంలోనూ తప్పుల తడకగా అలైన్‌మెంట్‌

పరిహారం భారీగా తగ్గించడంతో ఆందోళనలో భూ యజమానులు

సాక్షి, అమరావతి: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి (ఎన్‌హెచ్‌–16) సమాంతరంగా ఉన్న కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–216) విస్తరణ పనుల్లో భూ యజమానుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్న బాధితులు గోడు పట్టించుకోకుండానే మరింత కఠినంగా వ్యవహరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జూలై కల్లా ఎన్‌హెచ్‌–216 విస్తరణ పనులు పూర్తి చేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించిన నేపథ్యంలో.. భూ సేకరణకు అడ్డుపడితే కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే బలవంతంగా భూములు లాక్కోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకు సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌హెచ్‌–216 విస్తరణలో భాగంగా కాకినాడ బైపాస్‌ నిర్మాణానికి కేంద్రం రూ. 350.61 కోట్లు మంజూరు చేసింది. 20 కి.మీ. బైపాస్‌ నిర్మాణానికి 195 ఎకరాలు అవసరం కాగా, రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని, భవనాలకు అసంబద్ధంగా రేటు నిర్ణయించి పరిహారం అతి తక్కువగా ఇస్తున్నారని స్థానికులు  కొద్ది రోజుల్నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు.  నడకుదురు, తూరంగి గ్రామాల్లో రెండు కిలోమీటర్ల మేర బైపాస్‌ నిర్మాణం ఇష్టారీతిన మలుపులు తిప్పారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అవన్నీ పట్టించుకోకుండా తాజాగా ఆదేశాలివ్వడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆది నుంచి అన్నీ అనుమానాలే
ఎన్‌హెచ్‌–216 విస్తరణకు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను 2012లోనే అనుమతి కోసం కేంద్రానికి పంపించారు. 2013లో 351 కిలోమీటర్ల ఈ రహదారి విస్తరణకు అనుమతి లభించింది. అయితే ఈ రహదారి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యావరణ అనుమతులు పొందాలి. సామాజిక ప్రభావ అంచనా నిర్వహించి ప్రజల అనుమతి పొందాలి. ఇవేవీ లేకుండా రహదారికి విస్తరణ పనుల్ని కాంట్రాక్టు సంస్థ చేపట్టినట్లు భూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. కాకినాడ బైపాస్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపిస్తున్నారు.

195 ఎకరాలకు రూ.101 కోట్లు డిపాజిట్‌
కాకినాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే 195 ఎకరాలకుగాను ఎన్‌హెచ్‌ఏఐ రూ. 101 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఈ డబ్బుతోనే భూ సేకరణ చేపట్టాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఇక్కడ గజం రూ. 4,500 ఉంటే ప్రభుత్వం గజం విలువ రూ. 300 లెక్కగట్టి దానికి మూడు రెట్లు పరిహారం పెంచి రూ. 900 చొప్పున పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ యంత్రాంగం చెబుతుండటంతో భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు