అక్రమాలకు చెక్‌

11 Jul, 2019 08:19 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న ఉప్పర జమ్మి రోడ్డు  

ఇంజినీరింగ్‌ శాఖల పనుల్లో అవినీతిపై సర్కారు మూడో కన్ను

సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : పీకల్లోతున అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన ఇంజినీరింగ్‌ శాఖల భరతం పట్టేందుకు సర్కారు ఉపక్రమిస్తోంది. రహదారులు భవనాలు, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ వం టి ప్రధాన ఇంజినీరింగ్‌ శాఖల్లో అడ్డగోలు వ్యవహారాలపై చర్యలకు రంగంలోకి దిగింది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల్లో కొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. కావలసిన వారికి ఇంజినీరింగ్‌ శాఖల్లో పనులు అప్పగించారు. టెండర్ల నిబం« ధనలు, నియమాలను తుంగలో తొక్కారు. ఒకే రహదారిని బిట్లు బిట్లుగా విభజించి టెండర్లు లేకుం డా చేసి నామినేషన్‌ పద్ధతిలో అనుకున్న వారికి కట్టబెట్టారు.

అంతేకాకుండా వారికి అడ్వాన్సు ల రూపంలో భారీగా నిధులు కేటాయించి నాణ్యతకు పాతరేశారు. దీని దృష్ట్యా చేసిన పనుల్లో నాణ్యతాలోపం, ఇతర అంశాలను ఆరా తీయడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలున్నాయి. సుమారు 350కిపైగా గ్రామాలకు రహదారులు లేవు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడానికి రెండేళ్ల క్రితం ఉపాధి హామీ పథకం, పీఎంజేఎస్‌వై, ఎస్‌డీఎఫ్‌ పథకం పేరిట పలు రహదారి పనులు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయినా ఇప్పటికీ గిరిజన గ్రామాలకు రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే రాళ్లు తేలి నరకం చూడాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలన్నా, అటవీ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకు వెళ్లాలన్నా గిరి జనులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

25 శాతంలోపు పనులపై చర్యలు..
ఇంజినీరింగ్‌ శాఖల్లో అవకతవకలకు పాల్పడిన అక్రమార్కుల పనిపట్టేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని నియమ నిబంధనలను జారీ చేసింది. వీటిని అనుసరించి అంచనాలో 25 శాతంలోపు పని జరిగి ఉంటే అలాంటి వాటిని సమీక్షించి తదుపరి నిర్ణ యం తీసుకుంటారు. అంతకు పైబడి జరిగిన పనులు, వాటికి బిల్లుల తయారీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని వాటిని కొనసాగించడానికి అనుమతిస్తారు. పని ఒప్పందం కుదిరి ఇంకా ప్రారంభం కాకపోతే వాటిని రద్దు చేయనున్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో 124 రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేయడానికి పనులు చేయగా 108 పూర్తి చేశారు.

ఇంకా 16 పనులు పూర్తి చేయలేదు. సుమారు రూ.23 కోట్ల మేర బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. 85 రహదారులకు అప్‌గ్రేడ్‌ చేయాలని పనులు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా వీటిలో 60 పూర్తి చేశారు. ఇంకా 21 రహదారులు 25 శాతం లోపే పనులు జరిగాయి. అలాగే పంచాయతీరాజ్‌ విభాగం ఆధ్వర్యంలో రూ.66 కోట్లతో చేపట్టిన 144 పనుల్లో ఇంకా 90 వరకు పనులు ప్రారంభం కాలేదు. 

గత రహదారుల అక్రమాలపై చర్యలు నిల్‌
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలో 42 రహదారుల్లో అక్రమాలు జరిగాయని ప్రజాప్రతినిధులు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నిలదీ శారు. వీటిలో కేవలం 11 రహదారులపైన విచారణ చేసి వదిలేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రహదారుల్లో నాణ్యతాపరమైన లోపాలున్నాయని సాక్షాత్తు విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ అధికారులే ఎత్తిచూపారు. 20 రహదారులకు సంబంధించిన ఎం బుక్‌లను సీజ్‌ చేసి పట్టుకువెళ్లినట్టు సమాచారం. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సుల రూపంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ శాఖ పనులకు రూ.3 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు తెలిసింది. ఇలా పలు అక్రమాలు చోటు చేసుకోగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

టీడీపీ హయాంలో విచారణ నీరుగార్చారు
టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన రహదారుల నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. పనులు పూర్తి స్థాయిలో చేయకుండా, నాణ్యత పాటిం చకుండా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేయాలని గతంలో పలు పాలకవర్గ సమావేశాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే 

నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది
రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రహదారుల లోపాలపై ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ డిపార్ట్‌మెంట్‌ ద్వారా జరిగిన నిర్మాణాలను చూసినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 
– ఎం.తిరుపతిరావు, గిరిజన సంఘం నాయకుడు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు