సాక్షి కథనాలతో ప్రభుత్వంలో చలనం

28 Apr, 2017 14:40 IST|Sakshi

అమరావతి: కృష్ణానదిలో 100 ఎకరాలను కబ్జా చేసిన టీడీపీ నేతల ఇసుక మాఫియాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, రెవెన్యూ, హోం, మైనింగ్‌ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ... సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తామని, అక్రమ రవాణా నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు  తెలిపారు. కఠినమైన చట్టాలైతే ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా అమలు జరగడం లేదన్నారు. కేసుల నమోదు బాగానే ఉందని, ఆ తర్వాతే ఏం జరగడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. యంత్రాల ద్వారా ఇసుక తవ్వడానికి అనుమతిచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 44 చెక్‌పోస్టులున్నాయని, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక ర్యాంప్‌లను ఉపాధి హామీ కూలీల ద్వారా నిర్వహించేందుకు యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతను ఆర్డీవో, డీఎస్పీలకు అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు.

మరిన్ని వార్తలు