నేస్తమా.. నువ్వెక్కడ?

25 Feb, 2018 11:34 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు అందని శానిటరీ న్యాప్‌కిన్లు

రుతుక్రమం సమయంలో బాలికల అవస్థలు

పథకం అములుపై దృష్టి సారించని అధికారులు

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుతుక్రమ సమయంలో 15 ఏళ్లలోపు బాలికలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించిన అప్పటి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... రుతు రుమాళ్ల(శానిటరీ న్యాప్‌కిన్స్‌)ను ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో బాలికలకు ఉచితంగా అందజేశారు. ఒక్కో బాలికకు అప్పట్లో 6 నుంచి 8 న్యాప్‌కిన్లను పంపిణీ చేశారు. బయట మార్కెట్‌లో పదింటి ధర రూ.35 నుంచి రూ.50 వరుకు ఉంటుంది. అయితే మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కడంతో బాలికలకు రుమాళ్లు అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సొంత డబ్బుతో న్యాప్‌కిన్లు కొనుగోలు చేసుకునే స్థోమత లేకపోవడం, రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో
కర్ణాటక, కేరళ, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు రుమాళ్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. వీటిని వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా పాఠశాలలకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక గదులు లేవు
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల వ్యక్తిగత అవసరాలకు ఏ పాఠశాలల్లోనూ ప్రత్యేకమైన గదులు కానరావడం లేదు. ఫలితంగా విద్యార్థినుల హాజరు శాతం తగ్గడంతో పాటు వారు మానసికంగా కుంటుబాటుకు గురవుతున్నారు. బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చడంపై విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నేస్తం పథకాన్ని పునఃప్రారంభిండంతో పాటు ప్రత్యేక గదుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు