సర్కార్‌ చదువుతోనే గ్రూప్‌–1

8 Jun, 2018 11:43 IST|Sakshi
చదివిన స్కూల్లో ఓబులేశును సన్మానించిన దృశ్యం, పక్కన తల్లిదండ్రులు

గూడూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేశు

పుట్టింది ఓ కుగ్రామం.. వారిది సన్నకారు వ్యవసాయ కుటుంబం.. చదివింది ప్రభుత్వ పాఠశాలల్లో.. అయినా ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతం.. చిన్నతనంలోనే అంబేడ్కర్‌ ప్రభావం.. అకుంఠిత దీక్ష.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం.. ప్రణాళికాబద్ధంగా చదువు.. ఫలితంగా మొదట కేంద్ర ప్రభుత్వంలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగం.. అనంతరం గ్రూప్‌–1లో 15వ ర్యాంక్‌.. ప్రస్తుతం గూడూరు పురపాలక సంఘం కమిషనర్‌.. ఆయనే ఎద్దుల ఓబులేసు.. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆయన గురించి ‘సాక్షి’ కథనం. 

గూడూరు : ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమర్ల గ్రామానికి చెందిన ఎద్దుల నమ్మయ్య, నాంచారమ్మల కుమారుడు ఓబులేశు. చిన్ననాటి నుంచి ఓబులేశు ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థిగా గ్రామంలో పేరు తెచ్చుకున్నారు. పుట్టిన గ్రామంలోనే 5వ తరగతి వరకూ చదివి, అనంతరం పామూరులో 8వ తరగతి వరకూ, కనిగిరిలో 10వ తరగతి వరకూ విద్యనభ్యశించారు. ఇంటర్మీడియట్‌ మార్టూరులోనూ, బీటెక్‌ ఈసీఈ విజయవాడలోనూ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పూర్తి చేశారు. 2011వ సంవత్సరంలో వచ్చిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌కు ప్రిపేర్‌ అయ్యారు.

2013లో గ్రూప్‌–1 ఫలితాల్లో ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో కొందరు కోర్టును ఆశ్రయించగా అవి రద్దయిపోయాయి. దీంతో మళ్లీ 2016లో గ్రూప్‌–1 పరీక్ష రాసి 15వ ర్యాంకు సాధించారు. 2017లో జరిగిన ఇంటర్వ్యూలో ఓబులేసు గ్రూప్‌–1 అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూడూరు పురపాలక సంఘం కమిషనర్‌గా జూన్‌ 4న నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివినవారే ఎక్కువ శాతం మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు గ్రూప్‌–1, గ్రూప్‌–2 అధికారులుగా ఉన్నారని, తమ గ్రామంలో తనే మొదటి గ్రాడ్యుయేట్‌నని తెలిపారు.

ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు కృషి చేస్తాం
గూడూరు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులంతా కచ్చితంగా ప్రతిభ ఉన్నవారే ఉంటారు. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా కృషి చేస్తా. లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.    – ఓబులేశు, గూడూరు  మున్సిపల్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు