మీ పిల్లలకు తరుచూ తలనొప్పా.. జాగ్రత్త

8 Jun, 2018 11:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : మీ పిల్లలకు తరుచుగా తలనొప్పి వస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. మెదడులోని కణితుల వల్ల కూడా తరుచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని న్యూరోసర్జన్లు అంటున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2500 మంది పిల్లలు బ్రెయిన్‌ ట్యూమర్‌(మెదడులోని కణితులు)తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా మొబైల్‌ ఫోన్‌లను వాడటం వల్ల కూడా ట్యూమర్‌లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జైపూర్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌ డా.కేకే.బన్సాల్‌ మాట్లాడుతూ.. జన్యు సంబంధ అంటువ్యాధుల కారణంగా చిన్న పిల్లలలో ట్యూమర్లు వస్తున్నాయని అన్నారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నపుడు.. ఆమె గర్భం ధరించిన మొదటి మూడు నెలల వరకు తీసుకున్న మందులు, కాన్పుకు మూడు నెలల ముందు తీసుకున్న మందుల ప్రభావం ఉంటుందన్నారు.

ముఖ్యంగా రేడియేషన్‌ వల్ల కూడా జన్యు సంబంధ అంటువ్యాధులు వస్తాయన్నారు. గర్భిణిలు సెల్‌ఫోన్‌ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని సూచించారు. పిల్లలలో ఈ బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత కనబడతాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పిల్లలలో ఈ వ్యాధి మరింత పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ట్యూమర్లను తొలగించడానికి రెండు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మామూలు ట్యూమర్లను సర్జరీ ద్వారా తొలగించవచ్చు. మరి కొన్ని ట్యూమర్లను గామా నైఫ్‌ థెరపీ పద్దతి ద్వారా తొలగించవచ్చు. 

మరిన్ని వార్తలు