దిగిరాని అయ్యన్న

2 Mar, 2014 00:39 IST|Sakshi
దిగిరాని అయ్యన్న
  •     బుజ్జగింపునకు దేశం సకలయత్నాలు
  •      వెలగపూడి రాయభారం విఫలం
  •      తాజాగా యనమల రంగప్రవేశం
  •      బాబు వద్దకు తప్పని పంచాయతీ
  •  సాక్షి, విశాఖపట్నం:  తెలుగుదేశంపార్టీలో గంటా-అయ్యన్న  గ్రూప్ వార్ ముదిరిపాకానపడుతోంది. పార్టీకి పరిష్కరించలేని తలనొప్పిగా మారుతోంది. గంటా పార్టీలో చేరికపై అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న అయ్యన్నను బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కరకు రావడంలేదు. చివరకు ఈపంచాయతీ త్వరలో చంద్రబాబువద్దకు చేరబోతోంది.  అయ్యన్న వర్గంగా ముద్రపడ్డ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి గంటా ఆదేశం మేరకు శుక్రవారం నర్సీపట్నం రాయబారానికి వెళ్లారు. అయినా అయ్యన్న నుంచి స్పందన లేదు. చేసేది లేక వెలగపూడి రాయబారం నుంచి తప్పుకున్నారు.

    ఇదే విషయాన్ని శనివారం విలేకరులతో అన్నారు. సమస్య పరి ష్కారం బాబు  వలనే అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ వివాదం పార్టీ పరువు బజారుకీడుస్తుందేమోనని అధినాయకత్వం గుబులు చెందుతోంది. పంచాయతీ  తన వద్దకు రాకముందే రాజీ చేయాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఎంవీవీఎస్ మూర్తి రాజీ యత్నాలు కూడా బెడిసికొట్టడంతో వివాదాన్ని తేలికచేసే పనిని ఇప్పుడు యనమలకు అప్పగించారు.
     
    అయ్యన్నతో యనమల శనివారం ఫోన్లో సంప్రదించినట్లు తెలిసింది. ఈనెల 12న ప్రజాగర్జన తర్వాత మాట్లాడుకుందామని యనమల సూచిస్తున్నా అయ్యన్న పట్టు వీడడంలేదని తెలుస్తోంది. అవసరమైతే వివాదం సద్దుమణిగించేందుకు అయ్యన్న అడుగుతోన్న సీట్ల విషయమై తర్వాత నిర్ణయం తీసుకుందామని బుజ్జగిస్తున్నా ఆయన వినడంలేదు. ఇదేవిషయమై ‘సాక్షి’ యనమలతో ఫోన్లో మాట్లాడగా ఈవివాదంపై తాను అయ్యన్నతో ఫోన్లో మాట్లాడతానని చెప్పారు.
     
    గర్జన ఏర్పాట్లకు ఎలాగూ రావలసి ఉన్నందున వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలని ప్రస్తుతం ఈయన యోచిస్తున్నారు.  బండారు, గంటా కలిసి అయ్యన్న వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిస్తే వివాదం సమసిపోతుందని పార్టీ సీనియర్‌నేత గద్దె రామ్మోహన్ ఇటీవల సూచించారు. దీనికి గంటా ఇష్టపడడంలేదని సమాచారం. ప్రస్తుత వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక పార్టీ అధిష్ఠానం తలబద్దలుకొట్టుకుంటోంది.  ఎంవీవీఎస్ మూర్తి బాబును కలిసి మాట్లాడే అవకాశముంది.  అయ్యన్న తనను గజదొంగల చేరికతో పోల్చిన విషయాన్ని గంటా వద్ద ప్రస్తావిస్తే నో కామెంట్ అన్నారు. దీన్నిబట్టి గంటా రాజీకి సిద్ధంగా ఉన్నా, అయ్యన్న వైఖరే అంతుబట్టాల్సి ఉంది.
     

మరిన్ని వార్తలు