ఆశల కోట.. గండికోట..!!

1 Nov, 2019 07:04 IST|Sakshi
పెన్నా లోయ

గండికోట ఉత్సవాలపై పెరుగుతున్న అంచనాలు

పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

అధికారులు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం 

ఇంటాక్, ఇతర సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారం

గండికోట వారసత్వ ఉత్సవాలపై జిల్లా వాసుల్లో రోజురోజుకు ఆశలు పెరుగుతున్నాయి. జిల్లాలో అన్ని రకాల పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉందని ఇంటాక్‌తోపాటు ఇతర పర్యాటక అభివృద్ధి సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం, కొత్త ప్రభుత్వం రావడం, మన జిల్లా ముద్దుబిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా వాసుల్లో పర్యాటకరంగం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి. సీఎం ఇటీవల రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోటతోపాటు జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో  పర్యాటకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 

సాక్షి, కడప కల్చరల్‌ :  గండికోట వారసత్వ ఉత్సవాలపై కడప కల్చరల్‌: జిల్లా ప్రజలు, పర్యాటకాభిమానుల్లో రోజురోజుకు ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికి నాలుగుమార్లు గండికోట ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఏడాది జిల్లా వాసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో జరుగుతున్నాయి గనుక.. జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అంత సుముఖత వ్యక్తం చేయకపోయినా.. జిల్లాలోని పర్యాటక సంస్థలు, అభిమానులు, జిల్లా పట్ల అభిమానం గల అధికారుల సహకారంతో నిర్వహించగలిగారు. గత ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు అవసరమయ్యే నిధుల గురించి ఏటా పేచీ పెడుతూ వచ్చింది. తొలుత నవంబరులో నిర్వహించగా, అది క్రమంగా ఎప్పటికప్పుడు 
ఆలస్యమవుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించారు. 

మంచి రోజులొచ్చాయి..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రమంతటా పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించడం, జిల్లాలో గండికోటలో గాజు వంతెన, ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా మార్చడం, సోమశిల డ్యాంను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించడంతో జిల్లా పర్యాటకుల్లో సంతోషం వ్యక్తమైంది. గతంలో ప్రచారం లేకపోయినా.. నాలుగుసార్లు ఉత్సవాలు నిర్వహించడంతో గండికోట గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం వారాంతాలలో అక్కడి హరిత హోటల్‌లో గదులు దొరకని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో సందర్శించేందుకు వస్తున్నారు.

దీనికి తగినట్లుగా ప్రస్తుతం గండికోటను అద్దాల వంతెనతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, పెన్నా లోయలో సాహస క్రీడలను ప్రవేశ పెట్టి.. గండికోటను సాహస క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లా పర్యాటకానికి మంచిరోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ‘ఇండియన్‌ ›గ్రాండ్‌ క్యానియన్‌’గా పేరు గాంచిన గండికోటను అభివృద్ధి చేస్తామన్న ప్రకటన మరింత సంతోష పెట్టింది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన గండికోట.. పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఆ ప్రభావం జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలపై పడుతుందని, అక్కడ కూడా సందడి పెరుగుతుందని ఆశిస్తున్నారు.
 
వైభవాన్ని చాటి చెప్పాలి 
రాష్ట్ర మంతటా ఏటా దీపావళి నుంచి ఫిబ్రవరి చివరిలోపు పర్యాటక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ‘పర్యాటకం–ఉపాధి–ఆదాయం’ నినాదంతో ఈ ఏడాది ఇప్పటికే భీమిలి, విశాఖ, అరకు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబరు 9, 10 తేదీలలో భీమిలి ఉత్సవ్, డిసెంబరు 26, 27లలో విశాఖ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో అరకు ఉత్సవాల నిర్వహణపై కూడా ప్రకటన వెలువడింది. ఇందులో భీమిలి ఉత్సవ్‌కు రూ. 50 లక్షలు, విశాఖ ఉత్సవాలకు రూ.కోటి నిర్వహణ కోసం నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉండటంతో.. గతంలో రూ. 3 కోట్లతో గండికోట ఉత్సవాలు నిర్వహించినా ఈసారి అంత ఖర్చు చేసే పరిíస్థితి కనిపించడం లేదు. ఇచ్చినంతలోనే ఘనంగా జరుపుకునేందుకు అధికారులు రెండు నెలల ముందు నుంచి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది. అందుకు ప్రభుత్వ పర్యాటక అధికారులు కూడా తగిన దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.

అప్పటికప్పుడు ప్రకటించి హడావుడిగా కార్యక్రమాలు చుట్టేయకుండా.. సినిమా కళాకారుల పాట కచేరీలు, డ్యాన్సులతో పర్యాటకులను ఆకర్శించే ప్రయత్నాలకు ఈ సారైనా స్వస్తి చెప్పాలని.. గండకోట వైభవాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రెండు నెలల ముందు నుంచే స్థానిక కళాబృందాలను ఎంపిక చేసి వారిచే ప్రత్యేకంగా సాధన చేయిస్తే నాణ్యత గల ప్రదర్శనలను చూడవచ్చని సూచిస్తున్నారు. ఈ ఉత్సవాలకు కావాల్సింది సినీ నటుల ప్రదర్శనలు కాదని, వచ్చిన వారంతా తప్పక కోటను, అందులోని ఇతర నిర్మాణాలను  తిలకించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని జిల్లా పర్యాటక అభిమానులు భావిస్తున్నారు. సినీ కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం కంటే.. అందులో నాలుగో∙వంతు ఖర్చుతోనే తగిన సాధనతో స్థానిక కళాకారులతో నాణ్యతగల ప్రదర్శనలు పొందవచ్చని సూచిస్తున్నారు. ‘గండికోట వారసత్వ ఉత్సవాలు’ పేరిట ఉత్సవాలు జరుగుతున్నాయి గనుక కోట చరిత్ర, ఘనతను తెలిపే కార్యక్రమాలు, చారిత్రక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించినపుడే ఉత్సవాల ధ్యేయం నెరవేరగలదని పేర్కొంటున్నారు. మొత్తంపై ఈసారి గండికోట వారసత్వ ఉత్సవాలు అందరినీ అలరించే రీతిలో నిర్వహించగలరని ఆశిస్తున్నారు. 

ప్రయోజనం ఉండాలి 
కోట్లాది రూపాయలు పోసి 
సినీ నటుల ప్రదర్శనలకే ఉత్సవాలను పరిమితం చేయకూడదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గండికోటకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే దిశగా ఉత్సవాలను నిర్వహిస్తారన్న ఆశ ఉంది.
– గునిశెట్టి సాయికుమార్, పర్యాటకాభిమాని, కడప 

కోట ఘనతను చాటాలి 
గండికోటకు ఘనమైన చరిత్ర ఉంది. ఉత్సవాలలో ఆ చరిత్రను ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించాలి. అంత నిధులు వెచ్చిస్తున్నాం గనుక కోట భవితను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించాలి. 
– మన్నూరు వెంకట రమణారెడ్డి, పర్యాటక సంస్థ సభ్యుడు, కడప  

మరిన్ని వార్తలు