ఇంటర్‌ పరీక్షలకు జీఎస్టీ దెబ్బ

23 Feb, 2018 13:00 IST|Sakshi

హాల్‌ టికెట్‌కు రూ. 500 నుంచి రూ. 1000 వరకు వసూలు     

చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నవిద్యార్థులు

తెనాలిఅర్బన్‌: జీఎస్‌టీ ప్రభావం ఇంటర్‌ కళాశాలలపై పడింది. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు పరీక్ష హాల్‌ టిక్కెట్‌ ఇవ్వాలంటే రూ.500 నుంచి రూ.1000 నగదు జీఎస్‌టీ కింద చెల్లించాలని చెప్పి వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించని పక్షంలో హాల్‌ టిక్కెట్‌ ఇచ్చేదిలేదని చెబుతున్నారు. చేసేదిలేక విద్యార్థులు నగదు చెల్లిస్తున్నారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈ నెల 28 నుంచి, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

పరీక్షలకు సంబంధించిన హాల్‌ టిక్కెట్‌లను తెనాలి పట్టణంలోని అయా కళాశాలలు పంపిణీ చేస్తున్నాయి. ఇదే అదనుగా భా వించిన పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు జీఎస్‌టీ పేరిట విద్యార్థుల నుంచి కళాశాల స్థాయిని బట్టి వసూలు చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 వసూలు చేస్తుండగా, మరికొన్ని కళాశాలలు రూ.1000 వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజును గతంలోనే చెల్లించాం కదా ఇప్పుడు నగదు ఎందుకు ఇవ్వాలని విద్యార్థులు  ప్రశ్నిస్తే జీఎస్‌టీ అని చెబుతున్నారు. ఇదేమి ఖర్మరా బాబు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు