పని నిల్‌.. జీతం ఫుల్‌!

26 Jul, 2019 12:02 IST|Sakshi

మిర్చియార్డులో పనిలేని ఆపరేటర్లు      

సీజనల్‌ కండిషన్‌ కింద 39 మందిని తీసుకున్న వైనం

టీడీపీ హయాంలో అవసరం లేకున్నా ముడుపులు తీసుకుని నియామకం

ఈ నెలతో వీరికి ముగుస్తున్న  రెన్యూవల్‌ గడువు

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో అవసరం లేకున్నా మిర్చి యార్డులో 39 మంది సీజనల్‌ కండీషనల్‌ కింద ఆపరేటర్లుగా తీసుకున్నారు. వీరిలో అధిక శాతం మంది యార్డుకు రాకుండానే జీతాలు తీసుకునేవారు. ఈ నెలాఖరుతో వీరి రెన్యూవల్‌ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు యార్డు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మిర్చియార్డులో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంప్యూటర్‌ ఆపరేటర్ల అవసరం  లేకున్నా ఇష్టారాజ్యంగా నియమాకాలు చేసుకున్నారు. కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని వారిని కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమించారు.  వీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు, మార్కెట్‌ యార్డులో పని చేయకుండానే జీతాలు తీసుకుని వెళ్లిపోయారు. కొంతమంది సిబ్బంది  గతంలో పనిచేసిన యార్డు చైర్మన్‌కు డ్రైవర్‌గా, పీఏగా, ఫొటోగ్రాఫర్‌లుగా పనిచేసిన సందర్భాలున్నాయి. మార్కెట్‌ యార్డులో  రికార్డుల ప్రకారం మొత్తం 84 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. ఇందులో మార్కెట్‌ యార్డులో రోజువారీగా లావాదేవీలు, ఎంట్రీ చేసేందుకు 24 మందిని తాత్కాలికంగా నియమించారు.

గతంలో జాయింట్‌ కలెక్టర్‌ 10 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. సీజనల్‌ కండిషనల్‌ పేరుతో మరో 39 మందిని నియమించారు. వీరిలో ఎక్కువమంది ఏనాడూ యార్డులోకి వచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. జీతాల సమయంలో మాత్రం వచ్చి నెలకు రూ.15 వేలు తీసుకుపోవడం తప్ప వారు చేసే పని ఏమీ ఉండదు. అయితే  టీడీపీ ప్రభుత్వంలో యార్డులో పనిచేయకుండా జీతాలు తీసుకున్న వీరు, ప్రస్తుతం ఉద్యోగాలు పోతాయని, రెన్యూవల్‌ కావేమో అనే భయంతో, యార్డులో కనిపిస్తున్నారు. వీరికి పని లేకపోవటంతో  యార్డుకు వచ్చి టైం పాస్‌ చేసుకొని వెళుతున్నారు.

ముగియనున్న రెన్యూవల్‌ గడువు...
మిర్చియార్డుకు జనవరి నుంచి మేనెల వరకు రోజుకు లక్ష టిక్కీలకు పైగా సరుకు వస్తుంది. ఆ సమయంలో సరుకు తూకాలు వేసే సమయంలో వేమెన్‌ల వద్ద, సరుకు వివరాలను నమోదు చేసేందుకు కంప్యూటర్‌ ఆపరేటర్లు అవసరమని సాకు చెప్పి సీజనల్‌ కండిషనల్‌ పేరుతో 39 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. అయితే మార్కెట్‌ యార్డులో రెగ్యులర్‌గా 24 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వారే మిర్చి వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో పనిచేసిన మార్కెటింగ్‌ కమిషనర్‌ వీరిని రెన్యూవల్‌ చేసేందుకు నిరాకరించటంతో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి, రెన్యూవల్‌ చేయించారు. ప్రస్తుతం వీరి గడువుఈ నెల 31 వ తేదీతో ముగుస్తోంది. వీరిని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

సీజన్‌ లోనే తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటాం
సీజనల్‌ కండిషనల్‌ పేరుతో కొంతమంది కంప్యూటర్‌ ఆపరేటర్‌లను తీసుకున్నాం. ప్రస్తుతం మిర్చియార్డుకు 34 నుంచి 35 వేల టిక్కీల సరుకు మాత్రమే వస్తోంది. కాబట్టి గతంలో ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్లు సరిపోతారు. సీజనల్‌లో అవసరమైనప్పుడు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటాం. 
– వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌ సెక్రటరీ, గుంటూరు 

మరిన్ని వార్తలు