పార్లమెంట్‌లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు

26 Jul, 2019 12:10 IST|Sakshi

పారిశ్రామికాభివృద్ధికి చేయూతనివ్వండి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

సాక్షి, కడప కార్పొరేషన్‌: రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఐదేళ్లుగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి లోపించి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇదే పార్లమెంట్‌లో ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ట్యాక్స్‌ మినహాయింపులు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా  తమ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ రాష్ట్రం నుంచి 23 ప్రతిపాదనలు వచ్చాయని, ఎప్పటిలోగా వాటిని మంజూరు చేస్తారో చెప్పాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చన్నారు.

అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారని, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకునే కంపెనీలకు  కూడా ఈ స్కీంను వర్తింపజేస్తే అధిక ప్రయోజనం కలుగుతుందని, అనేకమందికి  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ది కూడా జరుగుతుందని వివరించారు. దీనిపై సంబంధిత మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే  రాయితీలు, సబ్సిడీలు,  ట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఏపి సర్కార్‌ ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఏపి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకున్న కంపెనీలకు వడ్డీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

రైతులను ఆదుకోండి
 2012–13 రబీ శనగపంటకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన వ్యవసాయ శాఖ జాయింట్‌ సెక్రటరీ డా. ఆశిష్‌ కుమార్‌ భుటానిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడేళ్లయినా ఇన్సూరెన్స్‌ రాకపోవడంతో రైతులు  ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, వెంటనే ఇన్సూరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీనిపై జాయింట్‌ సెక్రటరీ స్పందిస్తూ క్లెయిమ్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేసి మూడు రోజుల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఫైలు పంపిస్తానని చెప్పారు. 

ట్రిపుల్‌ తలాక్‌లో జైలుశిక్ష అభ్యంతరకరం  – ఎంపీ మిథున్‌రెడ్డి
రాజంపేట: ట్రిపుల్‌ తలాక్‌ చట్టం అభ్యంతకరంగా ఉందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన  పాల్గొన్నారు. చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలని చెప్పారు. వివాహమనేది సివిల్‌ కాంట్రాక్ట్‌ అయినప్పుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలుశిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతకరమని పేర్కొన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళాసాధికారతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ మరోసారి స్పష్టంచేశారు. ముస్లీం మైనార్టీ మహిళల భద్రతకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు