అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం

28 Jun, 2019 12:15 IST|Sakshi
అక్రమ కట్టడాన్ని కూల్చుతున్న జీవీఎంసీ సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం : బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాల్ని జేసీబీలతో కూలగొడుతుంటే.. వెన్నులో వణుకుపుట్టింది. సమ్మెటలతో నిర్మాణాల్ని ఛిద్రం చేస్తుంటే.. రానున్న రోజులు తలచుకొని కబ్జాదారులకు చెమటలు పట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేల అండతో.. నిబంధనలంటే లెక్కలేనితనంతో విచ్చలవిడిగా పెరిగిన అనధికార నిర్మాణాలపై జీవీఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి కూలగొడుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఆర్‌జే విద్యుల్లత.. ప్రతి వార్డులోనూ జల్లెడ పడుతూ.. అనధికార భవనాలపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఎక్కడ అక్రమ నిర్మాణం కనిపించినా వెంటనే కూల్చివేస్తున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినా.. అదనపు అంతస్తులు కనిపించినా పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు.

గురువారం నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో జోన్‌–1, 2, 3, 4, 5, 6తో పాటు అనకాపల్లిలో మొత్తం 15 భవనాలను జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది కూల్చేశారు. జోన్‌–1 పరిధిలో 1, 3 వార్డుల్లో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తుల్ని కూల్చేశారు. జోన్‌–2లోని కేఆర్‌ఎం కాలనీతో పాటు 18వ వార్డులో జీ ప్లస్‌–2 ప్లాన్‌ తీసుకొని అనధికారికంగా నిర్మిస్తున్న అంతస్తుని ధ్వంసం చేశారు. జోన్‌–3లో 26,27 వార్డుల్లో పెంట్‌ హౌస్‌తో పాటు.. అక్రమంగా ఫ్లోర్‌ నిర్మించేందుకు వేసిన పిల్లర్లను కూల్చేశారు. జోన్‌–4లోని 40, 41వ వార్డుల్లో అనధికార నిర్మాణాల్ని, జోన్‌–5 చిన గంట్యాడలో శ్రీనివాసా కల్యాణ మండపం భవనంలో వేస్తున్న అనధికార ఫ్లోర్‌ని పగులగొట్టారు. జోన్‌–6లోని పల్లి నారాయణపురం, వేపగుంటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేశారు. అనకాపల్లి జోన్‌ పరిధిలో గవరపాలెం, గాంధీనగర్‌లో పార్కింగ్‌ ప్రాంతంలో నిర్మించిన గదులతో పాటు, అనధికార ఫ్లోర్‌ని టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కూల్చివేశారు. ఈ డ్రైవ్‌ అనధికార నిర్మాణాలు పూర్తిగా తొలిగించే వరకూ కొనసాగుతుందని జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఆర్‌జే విద్యుల్లత స్పష్టం చేశారు. ఇకపై జీవీఎంసీ పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు రాకుండా ఉండేంత వరకూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో ఏసీపీలు నాయుడు, కె.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పులో కొనసాగిన కూల్చివేతలు
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు పక్రియ తూర్పు నియోజకవర్గంలో గురువారం కూడా కొనసాగింది. జోన్‌–2 టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పర్యవేక్షణలో రెండు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ఆ వివరాలను జోన్‌–2 అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాయుడు తెలిపారు. 10వ వార్డు కేఆర్‌ఎం కాలనీకి చెందిన కేఎస్‌ నారాయణరావు చేపట్టిన అక్రమ నిర్మాణంలోని 3వ అంతస్తు శ్లాబులను తొలగించారు. 18వ వార్డులోని కె.చిన్నారావుకు చెందిన భవనం 3వ ఫ్లోర్‌ను కూడా కూల్చివేశామన్నారు.

ఆరిలోవలో ఆక్రమణలపై కొరడా
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవలో అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఆరిలోవ పరిధి పెదగదిలి, చినగదిలి ప్రాంతాల్లో ఒకటో జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గురువారం నాలుగు అక్రమ నిర్మాణాలను తొలగించారు. పెదగదిలి సాలిపేటలో మూడో అంతస్తు, చినగదిలిలో మూడో ఫ్లోరు, దీనదయాల్‌పురంలో రెండు భవనాలపై మూడో అంతస్తులను అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చివేశారు. సాలిపేటలో మూడు అంతుస్తుతో పాటు దానిపై అడ్వర్టైజ్‌మెంట్‌ హోర్డింగ్‌ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని తొలగించారు. ఈ అక్రమ అంతస్తులన్నీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అండతో నిర్మించినవే. గతంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వాటి వద్దకు వెళితే నేరుగా ఆయనే ఫోన్‌ చేసి నిర్మాణాలకు అడ్డుపడొద్దంటూ హుకుం జారీ చేసేవారు. ఇప్పుడు ఆయన చేసేదిలేకపోవడంతో అనధికార నిర్మాణాల తొలగింపు ప్రక్రియను అధికారులు సజావుగా సాగించారు. ఆరిలోవ ప్రాంతంలో ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగిస్తామని బిల్డింగ్‌ ఇన్‌స్టెక్టర్‌ ఒ.వెంకటేశ్వరరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు