సార్.. మమ్మల్నీ చంపేస్తారేమో..!

4 Aug, 2015 02:40 IST|Sakshi
సార్.. మమ్మల్నీ చంపేస్తారేమో..!

ధర్మవరంలో నరకం  అనుభవించాం..
బాకీ తీరిస్తేనే మగ్గాల నుంచి బయటకు..
ఇక్కడికి వచ్చినా వెంటాడి వేటాడారు..
భయాందోళనకు గురవుతున్న బాధితులు, వలస చేనేత కార్మికులు

 
 కురబలకోట : ‘సార్.. మా వాడు రవి వీవర్స్ దారుణనానికి బలయ్యాడు.. మమ్మల్ని కూడా చంపేస్తారేమో.. భయమేస్తోంది..’ అంటూ ధర్మవరం నుంచి మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వలస వచ్చిన చేనేత కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ధర్మవరం నుంచి వచ్చిన ఏ.రవి దారుణ హత్యకు గురికాగా, ఆదివారం అమ్మచెరువు మిట్ట వినాయక చేనేతనగర్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న విషయం విదితమే. మద నపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం బాధిత కుటుం బీకులను రూరల్ సీఐ మురళి విచారించారు. ధర్మవరంలో మాస్టర్ వీవర్స్ సొసైటీని నాగరాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని, ఇతనికి వందలాది మగ్గాలు కూడా ఉన్నాయని బాధితులు వివిరించారు. ఇతని వద్ద పనిచేసే వారికి అప్పు ఇస్తాడని, ఆ తర్వాత తీర్చకపోతే బయటకు వదలడని.. దీంతో నరకం అనుభవించాల్సిందేనని వాపోయారు.

బాకీ తీరే వరకు వెట్టి చాకిరీ చేయాల్సిందేనన్నారు. కార్మిక, చేనేత, జౌళి శాఖల అధికారులు విచారణ జరిపినా తూతూమంత్రంగానే ఉంటాయని చెప్పారు. అతనంటే అందరికీ భయమేనన్నారు. ఎదు రు తిరిగితే శాల్తీలు గల్లంతవుతాయని హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇతని బారి నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రజాప్రతినిధికి మద్దతు పలకగా అద ృష్టవశాత్తు గెలిచాడన్నారు. ఆయన చొరవతో 500 మంది దాకా వీవర్స్ నిర్వాహకుడి వెట్టి నుంచి బయటపడ్డారన్నారు. తర్వా త తలో దిక్కుకు వెళ్లి బతుకు జీవుడా.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా 20 కుటుంబాల వాళ్లం రెండు నెలల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వచ్చామన్నారు. ఇక్కడ ఇంకా సరిగ్గా కుదురుకోకనే ధర్మవరం వీవర్స్ సొసైటీ వారు ఓర్వలేక పోయారని, వెంటాడి రవిని హత్య చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బతకనీయకుండా చే స్తే ఇక మేమెక్కడ బతకాలని వేదన పడ్డారు. స్పందించిన సీఐ.. ఎలాంటి దౌర్జన్యాలు జరక్కుండా చూస్తామని ధైర్యం చె ప్పారు. రవి హత్యకు ధర్మవరంలోని వీవర్స్ సొసైటీ నిర్వాహకులే కారణమని విచారణలో తేలిందన్నారు. రెండు, మూడు రోజుల్లో హంతకులు ఎవరన్నది తెలుస్తుందన్నారు. త్వరలోనే ఈ హత్య కేసును ఛేదిస్తామన్నారు.
 
 ఎన్నాళ్లున్నా గొర్రె తోక చందమే..
 చేనేత కార్మికుడికి చచ్చే వరకు సగం గుంత.. చచ్చాక నిండు గుంతన్నది.. నానుడిగా ఉంది. వారి జీవితాల్లో అక్షర సత్యంగా ఉంటోంది. చేనేత కార్మికులు సగం గుంతలోనే మగ్గాలు వేయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి చేస్తున్నా గొర్రె తోక చందంగా ఎదుగుబొదుగూ లేదని కార్మికులు వాపోయారు.
 

మరిన్ని వార్తలు