చిత్తూరులో భారీ వర్షాలు - ముగ్గురి మృతి

11 Nov, 2015 12:01 IST|Sakshi

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో ఇప్పటి వరకూ ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతైయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 50 కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.

భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులకు జల కళ వచ్చింది. జిల్లాలో ఉన్న 940 చెరువులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. బహుదా, ఆర్మియా, తుంబా ప్రాజక్టులు జలంతో కళకళలాడాయి. మల్లమడుగు, పింఛా, పూలకంటారావు పేట ప్రాజక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

గార్గేయ నదిలో మంగళవారం కొట్టుకు పోయిన తండ్రీ, కూతురుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నది దిగువ ప్రాంతంలో కూతురు మృత దేహం గాలింపు బృందాలకు లభించింది. కాగా.. తండ్రి మునిస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇక తిరుమల లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు లోని ట్రాఫిక్ ను లింక్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. కాగా.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు, జలపాతాలు నీటితో కళకళ లాడుతున్నాయి. ఆకాశ గంగ, గోగర్భం, పాప వినాశనానికి జలకళ వచ్చింది. కుమార ధార, పసుపు ధార డ్యాముల్లో 80 శాతం మేర నీరు చేరింది. ఇప్పటి వరకూ జలాశయాల్లో వచ్చి చేరిన  సరిగా వినియోగిస్తే.. మరో రెండేళ్ల పాటు తిరుమలకు నీటి కష్టాలు తీరినట్టే నని అధికారులు అభిప్రాయపడ్డారు.



 

>
మరిన్ని వార్తలు