పిట్టలు రాలుతున్నాయ్..!

27 May, 2015 02:11 IST|Sakshi

ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షుల మృతి
{బీడింగ్, నెస్టింగ్ సీజన్ విహంగాలకు కష్టకాలం
ఆహారం, నీరు దొరక్క వందల మైళ్లు వలసలు
టపటపా రాలిపోతున్న గుడ్లగూబలు, కబోది పక్షులు

 
విజయవాడ బ్యూరో: ఎండల తీవ్రత పక్షి జాతికి పెనుముప్పుగా మారుతోంది. వేసవి ధాటికి తట్టుకోలేక వివిధ రకాల పక్షులు నేల రాలుతున్నాయి. సరైన ఆవాసం, ఆహారం, నీరు లభించక వందల కిలోమీటర్లు వలస పోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక గుడ్లగూబలు, కబోది పక్షులు, నైట్‌హెరాన్స్, నైట్‌జార్స్ పరిస్థితి దయనీయంగా మారింది.  సాధారణంగా పక్షులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే మించితే వీటికి ప్రాణగండం పొంచి ఉన్నట్లే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో పగలు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కాకులు, పిచ్చుకలు, గోరింకలు, పావురాళ్లు, గద్దలు, కొంగలతో పాటు సైబీరియా, నార్త్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చే రెడ్‌శాంక్స్, వార్‌బర్డ్స్, పికెట్స్, పెలికాన్స్ వంటి జాతులు విలవిలలాడుతున్నాయి.
 
ఉత్తరాంధ్రలో పరిస్థితి తీవ్రం...

 హుద్‌హుద్ తుపాను కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పచ్చదనం మొత్తం హరించుకుపోయింది. దీంతో వేసవిలో గూడు (నెస్టింగ్) కోసం పక్షులకు కష్టకాలం వచ్చింది. కంబాలకొండ వైల్డ్‌లైఫ్  శాంచురీ మొత్తం తుపాను తీవ్రత కారణంగా దెబ్బతింది. దీంతో ఏటా ఇక్కడికొచ్చే పక్షులు ఈసారి లేకుండా పోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా పులికాట్ ప్రాంతాల్లోనూ ఎండల వల్ల పక్షుల సంఖ్య తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో జెముడు కాకులు, రామచిలుకలు, గద్దలు, గోల్డెన్ ఓరియోల్, బ్రామినీకైట్స్, అలెగ్జాండర్ పెరాకైట్స్ వంటివన్నీ పిల్లలను కనే  దశలో ఉంటాయి. ఎండల కారణంగా వాటి గుడ్లు ముందుగానే చితికిపోయి కొత్తతరం ఆగిపోతోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో మసలే కాకులు, పిచ్చుకలు, గోరింకలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు