Pudami Sakshiga: పక్షిగూడు.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే

15 Sep, 2023 15:58 IST|Sakshi

“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist

నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం.

కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే.

పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి.

కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి.

తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది.
►  కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి.
►  చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు.
►  కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది.

► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు.
 పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి.
►  పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి.
► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది.


► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది.

► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట.

గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది.

పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? 

రచయిత : రవి కుమార్‌ ద్వాదశి, ravikumardwadasi@gmail.com

తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com
మరిన్ని వార్తలు