అన్నదాతను ముంచేసిన హెలెన్ తుపాను

23 Nov, 2013 02:23 IST|Sakshi
అన్నదాతను ముంచేసిన హెలెన్ తుపాను

సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/నెట్‌వర్క్: అన్నదాత నెత్తిన మరో పిడుగు పడింది. మొన్నటి పై-లీన్, నిన్నటి భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే హెలెన్ దెబ్బకొట్టింది. మరికొద్ది రోజుల్లో చేతికొస్తాయనుకున్న పంటలను నిండా ముంచింది. గత నాలుగురోజుల నుంచి తీర ప్రాంతాలను గజగజలాడించిన హెలెన్ తుపాను శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. ప్రచండ గాలులు, భారీ వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తింది. తుపాను కారణంగా ఇళ్లు, చెట్లు కూలడం, విద్యుదాఘాతం తదితర కారణాలతో 11మంది మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇద్దరేసి, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు  చొప్పున మృతిచెందారు.
 
 పంట నష్టం విషయానికొస్తే.. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రెండు లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరిపంట పూర్తిగా దెబ్బతింది. 40 వేల ఎకరాల కొబ్బరి తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. 40 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. మరో 10 వేల ఎకరాల్లో అరటి, కూరగాయలు, 2 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పనలు, కుప్పల మీద ఉన్న 25 వేల ఎకరాల్లో పంట తడిసి ముద్దయ్యింది. కృష్ణా జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న 6.34 లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. మొన్నటి వర్షాల దెబ్బకు కోస్తాలో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మిగిలిన పంటలైనా కాపాడుకుందామన్న ఆశలపై హెలెన్ నీళ్లు చల్లడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. హెలెన్ ప్రభావంతో ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో చోటుచేసుకుంది. వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి. పూరిళ్లు కొట్టుకుపోయాయి. గంటకు 100 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులతో వందల సంఖ్యలో కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. మరోవైపు గోరుచుట్టుపై రోకటి పోటులా హెలెన్ తుపాను వెళ్తూ వెళ్తూ మరో గండాన్ని తెస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని, మరో నాలుగు రోజుల్లో మళ్లీ తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
 
 ‘కృష్ణా‘లో తీవ్రం.. గుంటూరులో స్వల్పం..
 కృష్ణా జిల్లాలో భారీ వర్షాల దెబ్బకు కోతకు సిద్ధంగా ఉన్న 6.34 లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. 300 గ్రామాలకు పైగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విజయనగరం జిల్లాలో  220 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, సుమారు వెయ్యి ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈదురు గాలులకు వేలాది ఎకరాల్లో పంట నేలమట్టమయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో మునగ, అరటి, బొప్పాయి వంటి పంటలు దెబ్బతిన్నాయి. విశాఖ జిల్లాలో చెరకు, అరటి, మొక్కజొన్న, వరి, వేరుశనగ, పత్తి పంటలకు నష్టం సంభవించింది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో 22 పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి 5,358 మందికి పునరావాసం కల్పించారు. గుంటూరు జిల్లాలో చలిగాలులు, చిరుజల్లులు తప్ప తుపాను ప్రభావం పెద్దగా లేదు. రెండు వేల కుటుంబాలను సురక్షిత కేంద్రాలకు తరలించారు.
 
 రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ మృతి
 పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావంతో ఏర్పడిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పెనుమంట్ర తహశీల్దారు దంగేటి సత్యనారాయణ(55) రోడ్డు ప్రమాదంలో మరణించారు. పెనుమంట్ర మండలం భట్లమగుటూరులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణ తన స్వగ్రామమైన నెగ్గిపూడి నుంచి కారులో బయలుదేరి పెనుమంట్ర వస్తుండగా ప్రమాదం జరిగింది. భట్లమగుటూరు బస్టాండ్ క్రాస్‌రోడ్ వద్ద కారు అదుపు తప్పి కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
 
 ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
 హెలెన్ తుపాను శుక్రవారం అర్ధరాత్రి సమయానికి వాయుగుండంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల రానున్న 24 గంటల వ్యవధిలో (శనివారం సాయంత్రం వరకు) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపనున్నట్టు అంచనా వేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, శనివారం ఉదయం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
 
 అప్రమత్తంగా ఉండండి: సీఎం
 తుపాను నేపథ్యంలో మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాను పరిస్థితిపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
 
 గోదావరి జిల్లాలు అతలాకుతలం..
 హెలెన్ తుపాను దిశ మార్చుకోవడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా పెనుగాలులు, వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గంటకు దాదాపు 100 కి.మీ. మేర గాలులు వీయడంతో పూరిళ్లు కొట్టుకుపోయాయి. కొబ్బరి, మామిడి చెట్లు కూకటి వేళ్లతో సహా లేచిపోయాయి. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. అరటి, బొప్పాయి తోటలు బాగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోయి వందలాది గ్రామాల్లో అంధకారం అలముకొంది. తూర్పుగోదావరిలో కోనసీమకు తీవ్ర నష్టం వాటిల్లింది.
 
 గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కోనసీమతో పాటు తీరప్రాంత గ్రామాల్లో 11 కేవీ హైటెన్షన్ స్తంభాలు 526, 33 కేవీ లో-టెన్షన్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రాజమండ్రి, కాకినాడ, ప్రధాన పట్టణాలతోపాటు 900గ్రామాల్లో గురువారం రాత్రి 11 గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సుమారు ఆరడుగుల మేర అలలు ఎగసిపడడంతో ఉప్పాడ నుంచి ఉప్పుటేరు పెదవంతెన వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా కోతకు గురైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 14 మండలాల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 4,930 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా కూడా తుపానుతో వణికిపోయింది. శుక్రవారం వేకువజాము నుంచే మొగల్తూరు, నరసాపురం మండలాలతోపాటు సమీపంలో ఉన్న భీమవరం, యలమంచిలి, కాళ్ల, ఆచంట, వీరవాసరం, పాలకొల్లు వంటి మండలాలతోపాటు జిల్లాలో 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. జిల్లావ్యాప్తంగా 223 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. 250 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.

మరిన్ని వార్తలు