కాలేయాన్ని కబళిస్తోంది

6 Aug, 2017 01:54 IST|Sakshi
కాలేయాన్ని కబళిస్తోంది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరిస్తున్న హెపటైటిస్‌–సి
వ్యాధి తీవ్రతను వెల్లడించిన కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ
బాధితుల్లో ఏపీ 2వ స్థానం.. తెలంగాణ 5వ స్థానం

సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలను కాలేయ వ్యాధి భయపెడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హెపటైటిస్‌–సి వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. హెపటైటిస్‌–సి కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నట్టు తాజా లెక్కల్లో తేలింది. అంతేగాక వ్యాధి బారిన పడ్డవారు ఆర్థికంగానూ చితికిపోతున్నారు. వ్యాధి ముదిరితే అత్యంత ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో దీనిబారిన పడుతున్న వారు ఎక్కువవుతున్నారు.

వ్యాధి లక్షణాలు
♦ ఆకలి మందగించడం.. పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుండటం
♦ బరువు తగ్గిపోతూ ఉండటం
♦ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉండటం
♦ కళ్లు పసుపు వర్ణంలోకి.. అంటే కామెర్లు వచ్చినట్టుండటం
♦ నీరసంగా అనిపించడం

దేశంలోనే రెండో స్థానంలో ఏపీ
దేశంలో హెపటైటిస్‌–సి వ్యాధి వ్యాప్తి ఎలా ఉందో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. లోక్‌సభలో ఎంపీ రంజిబ్‌ బిస్వాల్‌ హెపటైటిస్‌పై ప్రశ్నించినప్పుడు కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ సమాధానం ఇచ్చింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో హెపటైటిస్‌ బాధితుల సంఖ్యను వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతుండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్టు తేలింది. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.

గుర్తించడం కష్టం..
హెపటైటిస్‌–సి వ్యాధికి గురైన 90 శాతం మందిలో ఆ వ్యాధి ముదిరే వరకూ తెలిసే అవకాశం ఉండదు. ఇదే అతిపెద్ద ముప్పు. వైరస్‌ ద్వారా వ్యాపించే ఈ జబ్బు కాలేయాన్ని పూర్తిగా కబళిస్తుంది. రక్త మార్పిడి, కలుషిత ఆహారం, కలుషిత నీరు, వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు గాలిద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. హెపటైటిస్‌–సి రక్తపరీక్ష చేస్తేగానీ ఈ వ్యాధి నిర్ధారణ కాదు.

మరిన్ని వార్తలు