ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టే

2 May, 2015 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భాగంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయడం చట్ట సమ్మతం కాదని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లో మరో హైకోర్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామంటూ ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. అయితే ప్రత్యేక హైకోర్టు కోసం ఏర్పాట్లు చేయాల్సింది ఏపీ ప్రభుత్వమే తప్ప.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర హైకోర్టును ఆ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే వరకూ ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
 
 హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, విభజనపై వెంటనే నిర్ణయం తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఏపీ హైకోర్టును ఆ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం న్యాయవాదులతో కిక్కిరిసిన కోర్టు హాలులో తన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రత్యేక హైకోర్టు కోసం భూ సేకరణ చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్పిందని, అయితే నిర్ధిష్టంగా ఏ ప్రాంతంలో కేటాయించారో చెప్పలేదని కోర్టు ఎత్తిచూపింది. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత వచ్చాక.. అందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం, మౌలిక సదుపాయాలు సమకూరిన తర్వాత ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని తేల్చి చెప్పింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 51(3) ప్రకారం ఏపీలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపింది.


 

>
మరిన్ని వార్తలు