‘ప్రజావేదిక’పై జోక్యానికి హైకోర్టు నో

27 Jun, 2019 05:03 IST|Sakshi

స్టే ఇచ్చేందుకు తగిన కారణం కనిపించడం లేదు

అక్రమ నిర్మాణమని పిటిషనరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలం?

ప్రజావేదిక నిర్మాణంలో అక్రమాలపై వివరణ ఇవ్వండి

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు ఆదేశం

విచారణ జూలై 10కి వాయిదా

సాక్షి, అమరావతి: ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అలాగే నిర్మాణంలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణలను ఆదేశించి వారికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రజావేదిక నిర్మాణం, కూల్చివేతకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటివనరుల శాఖ, పురపాలక శాఖ, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శులు, తదితరులను ఆదేశించింది. కాగా, నిర్మాణంలో అక్రమాలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నివేదించింది. ప్రజావేదిక నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచి రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. హౌస్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్‌ అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ముందుగా పిటిషనర్‌ తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. కూల్చివేత వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్నారు. మంత్రిమండలితో, అధికారులతో చర్చించకుండానే ముఖ్యమంత్రి కూల్చివేత నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇది సమంజసం కాదన్నారు. ప్రజావేదిక చంద్రబాబుది కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని, దాన్ని కాపాడుకునేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశానని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజావేదిక అక్రమ నిర్మాణమా? కాదా? అని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణమేనని కృష్ణయ్య చెప్పడంతో మీరే అక్రమమని చెబుతున్నప్పుడు కూల్చివేత విషయంలో ఎలా జోక్యం చేసుకోమంటారని ఆయనను నిలదీసింది. 

ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనరే ప్రజావేదికను అక్రమ నిర్మాణమని ఒప్పుకుంటున్నారని, అటువంటప్పుడు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా చూడాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ప్రజావేదికను తనకు కేటాయించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కోరారని, దాన్ని ఆయనకు దక్కేలా చేసేందుకే పిటిషనర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని చెప్పారు. సీఆర్‌డీఏ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంసీ మెహతా వర్సెస్‌ కమల్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు నదీ పరీవాహక ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలపై స్పష్టమైన తీర్పునిచ్చిందని, దీనిప్రకారం నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలకు, భూములకు పట్టాలివ్వడానికి, ఆ భవనాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనన్నారు. కూల్చివేత చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు. ఏజీ, అదనపు ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పైన పేర్కొన్న విధంగా ఆదేశాలు జారీ చేసింది. 

అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు 
సీఆర్‌డీఏ అధికారులకు సీఎం ఆదేశం
అక్రమ కట్టడాలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాజధాని వ్యవహారాలపై సీఆర్‌డీఏ అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడా ఒక్క అక్రమ కట్టడం కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలన్నింటినీ గుర్తించి.. సంబంధిత వ్యక్తులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.  

>
మరిన్ని వార్తలు