వినోదం పేరుతో జేబులు గుల్ల

2 May, 2018 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సరదా కోసం వెళ్తే...అన్నింటా బాదుడే..

వద్దన్నా...వదలడం లేదు!

క్యాంటీన్లలో నిలువు దోపిడీ 

సగటు మానవునికి వినోదం కలిగించేవి సినిమాలే. కానీ అక్కడకు వెళ్లే ప్రేక్షకుడిని యాజమాన్యాలు పీడించేస్తున్నాయి. అడ్డూ అదుపూ లేని ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. నియంత్రణ లేని చర్యలతో దోచుకుంటున్నాయి. ఇదేమని అడిగితే... అది అంతే... చల్‌... అంటూ కసురుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అందుకే థియేటర్ల యజమానుల ఇష్టారాజ్యం నడుస్తోంది...

 శృంగవరపుకోట: సామాన్యుడు సరదా కోసం సినిమా హాల్‌కు వెళ్తే... అక్కడ లేనిపోని నిబంధనల పేరిట జేబులు ఖాళీ అవుతున్నాయి. రంగుల రంగస్థలంలో ఆనందిద్దామని వెళ్లే వారికి యాజమాన్యాలు ధరాభారంతో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. అదనపు వసూళ్లతో నిలువునా దోచేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన టికెట్‌ ధరలతో సతమతమవుతున్న వారికి నెలలో ఒక సినిమా చూసేందుకు ఒక కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చవుతోంది. ఇది భరించలేని సగటు మనిషి వినోదానికి దూరమవుతున్నాడు.  

జిల్లాలో గతంలో 76 థియేటర్లు ఉండగా వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గంలో 8, ఎస్‌.కోటలో 5, పార్వతీపురంలో 5, గజపతినగరంలో 3, చీపురుపల్లిలో 3, సాలూరులో 5, నెల్లిమర్లలో 3, విజయనగరం జిల్లా కేంద్రంలో 13 థియేటర్లు నడుస్తున్నాయి. వీటిలో సౌకర్యాలు ఎలా ఉన్నా ధరల బాదుడు మాత్రం తప్పడం లేదు. 

పార్కింగ్‌కు వద్దన్నా.. వదలట్లేదు..

సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు వచ్చే ప్రేక్షకులు, వినియోగదారుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూళ్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జిల్లా అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారుల వరకూ అందాయి. అయినా థియేటర్ల యజమానులు మాత్రం వదలటం లేదు. టూవీలర్‌కు రూ.10లు, ఆటో, కార్లకు రూ.20లు చొప్పున వసూలు చేస్తున్నారు. తీసుకున్న సొమ్ముకు కనీసం టోకెన్‌  ఇచ్చే వ్యవస్థ ఎక్కడా లేదు. 

క్యాంటీన్లలోనూ దోపిడీ...

థియేటర్లలో క్యాంటిన్లను కాంట్రాక్టర్లకు లీజుకు ఇస్తున్నారు. క్యాంటిన్ల నిర్వాహకులు నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు తినుబండారాలు, డ్రింక్స్, బిస్కట్స్, ఐస్‌క్రీమ్స్‌ వంటివి అమ్ముతున్నారు. క్యాంటిన్ల వద్ద ధరల పట్టికలు ఎక్కడా కానరావు. అడిగితే నచ్చితే కొను..లేదందటే బయటికిపో... అంటూ ప్రేక్షకులకు చీదరింపులే ఎదురవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ ఏమీ ఎరగనట్టు నిద్ర నటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కోర్టు ఉత్తర్వుల పేరుతో లూఠీ...

థియేటర్ల నిర్వహణ పెనుభారం కావటంతో ఉన్న థియేటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి పోయాయి. తక్కువ సమయంలో సొమ్ము చేసుకోవాలనే కాంక్షతో కోర్టు ఉత్తర్వులు పేరు చెప్పి టికెట్ల ధరలు అమాంతం పెంచి లూఠీ చేయటంతో సగటు ప్రేక్షకుడు రెండు వారాల వరకూ థియేటర్ల వైపు పోవటం లేదు. ఈ లోగా సినిమా మారిపోయి తమ అభిమాన నటుల చిత్రాలు చూసి ఆనందించే భాగ్యం కూడా సాధారణ ప్రజలకు దక్కటం లేదు. సినిమా పైరసీకి పెరిగిన టికెట్ల ధరలు కూడా కారణమే అని చెబుతున్నారు.

నియంత్రణ ఉండాలి..

ఉన్నత వర్గం నుంచి సామాన్యుల వరకూ వినోదం పంచే సాధనం సినిమా. అది అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలి. అడ్డగోలు నిబంధనలతో థియేటర్ల ఉనికికి చేటు చేస్తూ, దాన్ని అధిగమించటానికి అధిక వసూళ్లకు పాల్పడటం సరికాదు. సినిమాహాళ్లపై కచ్చితమైన నియంత్రణ ఉండాలి. – సి.హెచ్‌.పద్మావతి, వైఎస్సార్‌ సీపీ మహిళా నేత

దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

కోర్టు ఉత్తర్వుల పేరుతో అ«ధిక రేట్లకు టికెట్ల అమ్మకాలు, పార్కింగ్‌ చార్జీలు, క్యాంటీన్లలో అమ్మకాల పేరుతో జేబులకు చిల్లుపెట్టి సామాన్యుల్ని దోపిడీ చేసే వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. సమాజంలో అన్ని వర్గాల వారికి స్వేచ్ఛగా బతికే అవకాశం ఇవ్వాలి. –బుగత అప్పలరాజు, ఎస్‌.కోట

వినోదం సామాన్యుల హక్కు...

వినోదం సామాన్యుల హక్కు. సగటు మనిషి సినిమాను చూసే అవకాశం లేకుండా చేయటం నేరం. చట్టాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసే అధికారులు వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్న బాధ్యతను విస్మరించటం సరికాదు. ఉన్న చట్టాలను అమలు చేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమన్యాయం జరుగుతుంది. –కె.రామరాజు, న్యాయవాది, ఎస్‌.కోట  

మరిన్ని వార్తలు