అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం

1 Nov, 2023 04:02 IST|Sakshi

ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు

ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు 

మధ్యాహ్నం 12 గంటలకు ఆలయానికి చేరుకున్న సిరిమాను 

4.30 గంటలకు చదురుగుడినుంచి రథం ప్రారంభం 

మూడు సార్లు కోట వరకు వెళ్లి వచ్చిన రథం 

సిరిమాను పైనుంచి భక్తులపైకి అక్షతలు చల్లిన పూజారి 

3.5 లక్షల మంది సిరిమాను ఉత్సవాన్ని వీక్షించినట్లు అంచనా

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత మంగళవారం ఉదయం పైడితల్లి అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే సిరిమాను హుకుంపేట నుంచి ఆలయానికి చేరుకుంది. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు.

మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను కట్టడాలు పూర్తి చేసి, పూజలు చేశారు. 4:30 గంటలకు మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి సిరిమాను రథం బయల్దేరింది. మూడుసార్లు ఆలయం నుంచి కోట వరకూ వెళ్లింది. సిరిమానుపై ఆశీనులైన పూజారి రూపంలో ఉన్న అమ్మవారు పైనుంచి అక్షితలను చల్లి భక్తులను ఆశీర్వదించారు. ఉత్సవం సాయంత్రం 5.56 గంటలకు పూర్తయింది. సిరిమాను తిరుగుతున్నంతసేపూ ఆలయంలోని అమ్మవారికి వేదపండితులు లక్ష పుష్పార్చన చేశారు.

సుమారు మూడున్నర లక్షల మంది సిరిమాను ఉత్సవాన్ని వీక్షించినట్లు అధికారులు అంచనావేశారు. విజయనగరం కోటపై నుంచి అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు, జిల్లా సహకార బ్యాంకు ప్రాంగణంలోనుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిరిమానును వీక్షించారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా నిరంతర నిఘా పెట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సిరిమానోత్సవాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. సిరిమానోత్సవం సందర్భంగా నిర్వహించిన విజయనగరం సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు 
సిరిమానోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు, భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులతో పాటు మంత్రి గుడివాడ అమర్‌నాథ్, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, సినీ నటుడు సాయికుమార్‌  తదితరులు దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు