జుమ్‌జుమ్మని.. టేకాఫ్‌..!

10 Aug, 2019 14:25 IST|Sakshi

ఫ్లైట్‌జర్నీలో హైదరాబాదీల మహాస్పీడ్‌

అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాల్లో రెండో స్థానం

బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు

దేశీయ ప్రయాణాల్లో విజయవాడ, తిరుపతిలు సైతం 

సాక్షి, హైదరాబాద్‌: విమాన ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలు టాప్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల వృద్ధిలో దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిలు సైతం భారీ వృద్ధిని సాధించాయి. తాజాగా ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ విడుదల చేసిన వార్షిక నివేదికలో అంతర్జాతీయ టెర్మినల్‌ కలిగిన మహా నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్‌ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో మొదట్రెండు స్థానాల్లో నిలబడ్డాయి. ప్రయాణికుల సంఖ్యలో ఢిల్లీ, ముంబైలు తొలి రెండు స్థానాల్లో ఉన్నా 2018–19 కాలంలో వృద్ధిని సాధించలేకపోయాయి. దేశీయ ప్రయాణాల్లో ముంబైలో ఏకంగా 2017–18తో పోలిస్తే 1.3 శాతం ప్రయాణికులు తగ్గిపోగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 5.7 శాతం వృద్ధితో దేశంలోని మిగిలిన మెట్రో నగరాల వరసలో చివరకు చేరింది. 

బెంగళూరు–భాగ్యనగరం పోటాపోటీ 
బెంగళూరు–హైదరాబాద్‌లో ఫ్లైట్‌ జర్నీ విషయంలో పోటాపోటీగా నిలబడ్డాయి. ఐటీ, సినిమా, ఫార్మా, హెల్త్, ఎడ్యుకేషన్‌ రంగాలు భారీగా విస్తరించటంతో జాతీయ సగటు కంటే ఈ రెండు నగరాలు అత్యధిక ప్రయాణికులతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. దేశీయ ప్రయాణాల్లో బెంగళూరు 24.8 శాతం ప్రయాణికుల వృద్ధితో తొలి స్థానంలో నిలబడితే, హైదరాబాద్‌ 20.4 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. మూడ్నాలుగు స్థానాల్లో చెన్నై, కోల్‌కతా మహా నగరాలు నిలిచాయి. ఇక విదేశీ ప్రయాణాల్లో 17.5 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిస్తే.. 8.1 శాతం వృద్ధితో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. 

విజయవాడ, తిరుపతిలు సైతం.. 
ఇక దేశీయ విమానాశ్రయాలు కలిగిన పట్టణాల విషయంలో తిరుచ్చి మొదటి ప్లేస్‌లో ఉండగా, విజయవాడ, తిరుపతి పట్టణాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ఇటీవలి కాలంలో ఫ్లైట్‌ కనెక్టివిటీ పెరగటంతోపాటు ప్రయాణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 57.9 శాతం వృద్ధితో దేశంలోని దేశీయ విమానాశ్రయ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది.

>
మరిన్ని వార్తలు